● మొగ్గుచూపుతున్న దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు ● ఉమ్మడి జిల్లాతోపాటు ఏపీ నుంచీ చికిత్స కోసం వస్తున్న రోగులు
చండ్రుగొండ : హోమియో వైద్యానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో ఓ విభాగమైన హోమియో వైద్యం వైపు బాధితులు మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 20 వరకు హోమియో వైద్యకేంద్రాలు ఉన్నాయి. అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, చండ్రుగొండ, కల్లూరు, పెనుబల్లి, మధిర, కూసుమంచి తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు ఏపీ నుంచి కూడా బాధితులు చండ్రుగొండ కేంద్రానికి వచ్చి చికిత్స పొందుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వస్తున్నట్లు ఇక్కడి డాక్టర్ పానం ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రోజుకు ఓపీ 150 నమోదవుతుందని, ఇప్పటివరకు ఇక్కడ 12 వేల మందికి చికిత్స పొందారని పేర్కొన్నారు. బీపీ, షుగర్, కీళ్లవాతం, థైరాయిడ్, కిడ్నీల్లో రాళ్ళు, మైగ్రెయిన్, సొరియాసిస్, తామర, సైనసిస్, ఆస్తమా జ్వరం తర్వాత వచ్చే నొప్పులు తదితర సమస్యలతో బాధపడేవారు, మహిళకు సంబంధించి అండాశయంలో నీటిబుడగలు, గర్భాశయ సమస్యలు, రుతు సమస్యలు ఉన్నవారు వచ్చి చికిత్స పొందుతున్నారు. సాధారణంగా కేంద్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుందని, రోగుల సంఖ్య అధికంగా ఉండటంతో ఒక్కో రోజు రాత్రి 8 గంటల వరకు వైద్యసేవలు అందిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు.
వైద్యుడికి అదనంగా ఇన్‌చార్జి బాధ్యతలు
చండ్రుగొండ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు కొన్ని నెలలక్రితం శాఖ ఉన్నతధికారులు కల్లూరు మండలం చినకోరుకొండిలోని వైద్యకేంద్రం బాధ్యతలను అదనంగా అప్పగించారు. దీంతో వారంలో మూడు రోజులు చండ్రుగొండలో, మరో మూడురోజులు చినకోరుకొండిలో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఫలితంగా ఇక్కడకు వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా పరిష్కారం కాలేదని స్థానికులు పేర్కొంటున్నారు.