మణుగూరుటౌన్: పట్టణంలో రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనటడంతో పెట్రోల్ పైపులు ఊడిపోయి మంటలు చెలరేగి ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ పైపులు ఊడిపోయి మంటలు చేలరేగాయి. సుందరయ్యనగర్‌కి చెందిన భుక్య సక్రాం, పగిడేరు గ్రామానికి చెందిన దోమల పవన్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 100 పడకల ఆస్పత్రికి తరలించారు.
బైక్ ఢీకొట్టిన ఘటనలో కేసు నమోదు
పాల్వంచరూరల్: స్కూటీపై వెళ్తున్న మహిళను మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో మహిళ తీవ్రంగా గాయపడగా.. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాండురంగాపురం సమీపంలోని తవిశలగూడెంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఎం.పుష్పలత ఈ నెల 20వ తేదీన స్కూటీపై పాల్వంచకు వెళ్తుండగా ఆదే సమయంలో తవిశలగూడెం వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న చలిమల వేణు ఢీకొట్టాడు. పుష్పలతకు తీవ్రగాయాలు కాగా స్కూటీ ధ్వంసమైంది. ఆమెను 108 ద్వారా పాల్వంచలోని ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పుష్పలత సోదరుడు చింతపల్లి విజయకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
గుట్కాప్యాకెట్ల పట్టివేత
భద్రాచలంఅర్బన్: పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను శనివారం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని ఇందిరామార్కెట్‌లోని రాందేవ్ ఫ్యాన్సీ దుకాణం నిర్వాహకుడు మల్లిబేరరామ్.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా గుట్కాప్యాకెట్లు కొనుగోలు చేసి తన దుకాణంలో నిల్వ ఉంచాడు. ఇక్కడి నుంచి చిన్నచిన్న దుకాణాలకు రిటైల్‌గా విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా పెద్ద మొత్తంలో గుట్కా ప్యాకెట్లు లభ్యమవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌ను తరలించినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గుట్కాప్యాకెట్ల విలువ రూ.1,76,100 అని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని టౌన్ ఎస్‌ఐ వెల్లడించారు.
నీటి గుంటలో జారిపడి బాలుడి మృతి
వైరా: ప్రమాదవశాత్తు నీటి గుంటలో జారి పడిన బాలుడు మృతి చెందిన ఘటన వైరా మున్సిపాలిటీ పరిధి బీసీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బీసీ కాలనీకి చెందిన బెజ్జం బాలస్వామి – మేరీ దంపతుల కుమారుడు రాబిన్(9) స్నేహితులతో కలిసి వైరా రిజర్వాయర్ సమీపాన ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో నీటి అంచునకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు అక్కడి గుంటలో జారి పడగా, ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు. ఆయన స్నేహితులు ఇచ్చిన సమాచారంతో స్ధానికులు, రాబిన్ తల్లిదండ్రులు చేరుకుని ఆయనను బయటకు తీసి ద్విచక్రవాహనంపై అస్పత్రికి తీసుకెళ్లేలోగా ఆయన బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా, బాలుడు బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుండగా, ఆయన సోదరి మణుగూరులోని గురుకులంలో పదో తరగతి చదువుతోంది. పాఠశాల నుంచి రాగానే ఆడుకోవడానికి వెళ్లిన రాబిన్ మృత్యువాత పడడంతో ఆయన తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
మంటలు చెలరేగి ఇద్దరికి గాయాలు