పెదవాగు సమస్యకు
అశ్వారావుపేటరూరల్/చండ్రుగొండ/ములకలపల్లి : పెదవాగు ప్రాజెక్టు సమస్యను 15 రోజుల్లో కొలిక్కి తెస్తానని, దీనిపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎస్‌లకు నోటీసులు జారీ చేసి ఢిల్లీకి వచ్చేలా చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. గతేడాది జూలై 18న గండ్లు పడిన పెదవాగు ప్రాజెక్టును సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఇది ఇంటర్ స్టేట్ ప్రాజెక్టుగా మారిందని, పునఃనిర్మాణం చేయాలంటే జీఎంఆర్‌బీ నిబంధనల ప్రకారం తెలంగాణ 15 శాతం, ఏపీ 85 శాతం వాటా నిధులు కేటాయించాల్సి ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల సమన్వయంతోనే నిధుల విడుదల సాధ్యమని చెప్పారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో పాటు భద్రాద్రి, ఏలూరు జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఎస్‌ఈలను ఢిల్లీ పిలిపించి ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులతోనూ చర్చిస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయలపై మాట్లాడుతూ అసభ్య పదజాలం వాడడంతో ఉన్నతాధికారులు, రైతులు, ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రసంగం పూర్తి కాకముందే సభకు హాజరైన పలువురు వెనుదిరిగారు. అంతకుముందు ఆయన రెడ్డిగూడెంలో కొండరెడ్లతో మాట్లాడి జాతీయ ఎస్టీ కమిషన్, ట్రైకార్, ఐటీడీఏ ద్వారా కల్పించే అవకాశాలు, రుణాల గురించి వివరించారు. పెదవాగు సమీపంలోని శ్రీ గంగానమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు.
వెంగళరాయ సాగర్ పరిశీలన..
చండ్రుగొండ మండలం సీతాయిగూడెం సమీపంలోని వెంగళరాయసాగర్‌ను హుస్సేన్‌నాయక్ పరిశీలించారు. ఇది శిథిలావస్థకు చేరి ఆరేళ్లయినా పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికీ శాశ్వత మరమ్మతులు చేయించలేదని, ఒక పంటకు కూడా నీళ్లు సరిపోవడం లేదని రైతులు, చేపలు సక్రమంగా పెరగడం లేదని మత్స్యకారులు ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా పేదరైతులు ఆధారపడిన ఈ ప్రాజెక్ట్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయకపోవడం విచారకరమన్నారు. పేదల దుస్థితిపై మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గిరిజనుల ఓట్లతో గెలుపొందిన వారు పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. ఆర్‌ఓఆర్ పట్టాలు పొందిన భూముల్లో విద్యుత్ సదుపాయం, బోరుబావుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్‌కు సూచించారు. ఆ తర్వాత ములకలపల్లి మండలం సండ్రకుంటలో జరిగిన ఎస్టీ కోయ ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ఆరోపించారు. ఆదివాసీలకు ఏమైనా సమస్యలుంటే ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్టీ కమిషన్ కోర్టు లాంటిదని, సత్వర సమస్యల పరిష్కారానికి ఇది మంచి మార్గమని తెలిపారు. మారుమూల ఏజన్సీ గ్రామాల్లో జేవీఆర్ ట్రస్ట్ చేపడుతున్న సేవలు అభినందనీయమన్నారు. గ్రామంలో సిమెంట్ రేకులతో షెడ్డును పోలిన అంగన్‌వాడీ కేంద్రాన్ని చూసి విస్మయం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన సత్యావతి అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నారని, ఆమె అత్త నాగమ్మ రెండు కుంటల భూమి దానం ఇవ్వడంతో, తాత్కాలికంగా రేకులు వేసి, క్లాసులు నిర్వహిస్తున్నట్లు చెప్పగా పక్కా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ రాహుల్, ఆర్డీఓ మధుసూదన్, డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్, మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు, ఎన్పీడీసీఎల్ ఎస్ మహేందర్, ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఐటీడీఏ డీడీ మణెమ్మ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ సురేష్‌కుమార్, డీఈలు కృష్ణ, బాపనయ్య ములకలపల్లి తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ రేవతి పాల్గొన్నారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులతో ఢిల్లీలో చర్చిస్తా
రెండు రాష్ట్రాల సీఎంలతోనూ మాట్లాడుతా
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ వెల్లడి
అశ్వారావుపేట, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో పర్యటన
సమన్వయంతోనే సాధ్యం
పెదవాగు ప్రాజెక్టు పునఃనిర్మాణానికి సాంకేతిక సమస్యలు ఉన్నాయని, ఇరు రాష్ట్రాల సమన్వయంతోనే పరిష్కారం సాద్యమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రాజెక్టు పునఃనిర్మాణానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పుడున్న మూడు గేట్లను పెంచాల్సి ఉంటుందని చెప్పారు. డిజైన్ సక్రమంగా ఉంటేనే మరో 50 ఏళ్ల పాటు ప్రాజెక్టు నిలుస్తుందని వివరించారు. వెంగళరాయ ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఆయిల్‌పాం సేద్యంపై దృష్టి సారించాలని సూచించారు.