చర్ల: పోస్టల్ ఉద్యోగుల నిర్లక్ష్యంతో అందాల్సినవి అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నాట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటన మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. చినమిడిసిలేరు నుంచి తిమ్మిరిగూడెంనకు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులు, వివిధ కార్యాలయాల నుంచి వచ్చిన సర్టిఫికెట్లు పడి ఉండడాన్ని పశువుల కాపరులు గమనించారు. వారు మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా సుమారు 200కు పైగా పలు కార్డులు, సర్టిఫికెట్ల కవర్లు దర్శనమిచ్చాయి. ఇవి చినమిడిసిలేరుకు సమీపంలో ఉన్న బ్రాంచ్ పోస్టాఫీస్‌కు చెందినవని తేలగా.. అక్కడ పనిచేస్తున్న వారే వీటిని పడేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోస్టల్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని చినమిడిసిలేరులోని బ్రాంచ్ పోస్టాఫీస్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఇంట్లో ఉండే వృద్ధురాలు.. పనికిరాని మందులతో పాటు పోస్టల్ బ్యాగులోని ఉత్తరాలు, కవర్లు, పలు గుర్తింపు కార్డులను చెత్త కాగితాలుగా భావించి పడేసినట్లుగా తెలిసింది. ఈ విషయమై సత్యనారాయణపురం సబ్ పోస్టాఫీస్‌కు చెందిన పోస్‌మాస్టర్‌ను వివరణ అడిగేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.
అడవిలో దర్శనమిచ్చిన విలువైన కార్డులు, ఉత్తరాలు