అశ్వాపురం: మండలంలోని మొండికుంట సెంటర్‌లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి ఓ కారు దూసుకొచ్చింది. దీంతో ఇద్దరు గాయపడ్డారు. కొత్తగూడెం నుంచి మణుగూరు వైపు వెళ్తున్న కారు మొండికుంట గ్రామంలో నెల్లిపాకబంజర – భద్రాచలం సెంటర్‌లో వేగంగా దూసుకొచ్చి ఓ దుకాణం బోర్డు, బీఆర్‌ఎస్ దిమ్మె, మరో దిమ్మెను ఢీకొట్టి ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికుల్లో నెల్లిపాకబంజర గ్రామానికి చెందిన వద్దిపర్తి శ్రీఅంజన, తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ మురళికి గాయాలయ్యాయి. మురళి కారు కింద పడగా ఎలాంటి ప్రమాదం జరగలేదు. శ్రీఅంజనకు కాలు విరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో భద్రాచలం తరలించారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
నిల్వ ఉంచిన ఇసుక సీజ్
పినపాక: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ నరేశ్ మాట్లాడుతూ.. మండలంలోని బయ్యారం క్రాస్‌రోడ్‌లో ప్రైవేట్ బంక్‌లో అక్రమంగా ఇసుక నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు దాడి చేశామని, సుమారు పది ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశామని తెలిపారు.
ప్రహరీ కూల్చిన మహిళపై కేసు
పాల్వంచరూరల్: తన ఇంటి హద్దులో ప్రహరీ నిర్మించారని ఆరోపిస్తూ.. ఓ మహిళ ఆ గోడను కూల్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని కోడిపుంజులవాగు గ్రామానికి చెందిన కొర్ర కీమియా తన కుమారుడి వివాహం చేయడం కోసం ఇటీవల రూ.20 వేలతో ఇంటి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. ఈ గోడ తన ఇంటి హద్దులో ఉందని బానోతు లక్ష్మీ సుత్తితో ఈనెల 9వ తేదీన కూల్చింది. అంతేకాకుండా దుర్భాషలాడుతూ చంపుతామని బెదిరించిందని, చర్యలు తీసుకోవాలని కీమియా శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్ష్మీపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
స్కూటీని ఢీకొట్టిన లారీడ్రైవర్‌పై..
పాల్వంచరూరల్: ఎదురుగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన లారీడ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వంచ పట్టణంలోని జాట్‌ఫాట్ రాములు కుమారుడు కార్తీక్ ఈనెల 7వ తేదీన భద్రాచలంలో పనిచేసి స్కూటీపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆర్‌టీఏ చెక్‌పోస్టు సమీపంలో భద్రాచలంవైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో కార్తీక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కార్తీక్ తండ్రి రాములు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా లారీడ్రైవర్ సత్తిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు