● రామయ్య కల్యాణానికి సమర్పించిన భక్తజనం ● భక్తి శ్రద్ధలతో పండించి.. గోటితో వలిచి తీసుకొచ్చిన పలువురు ● ఉమ్మడి రాష్ట్రం నుంచి తరలివచ్చిన భక్తులు
ఐదేళ్లుగా సమర్పిస్తున్నా..
భద్రాచలంలో స్వామి కల్యాణంలో వినియోగించే తలంబ్రాలలో మేం పండించి తీసుకొచ్చిన తలంబ్రాలు కలిపేందుకు ఐదేళ్లగా వస్తున్నాం. మా కాలనీలో పలువురు భక్త మండలిగా ఏర్పాటై కాలినడకన వచ్చి రామయ్యకు తలంబ్రాలు సమర్పిస్తున్నాం.
–సరస్వతి, మహబూబాబాద్
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగే సీతారాముల కల్యాణ ఘట్టంలో తలంబ్రాలు ప్రధానమైనవని చెప్పాలి. స్వామి, అమ్మ వార్ల కల్యాణ తంతు ముగియగానే వారి పైనుంచి జాలువారిన తలంబ్రాలు దక్కించుకునేందుకు భక్తజనం పోటీ పడతారు. కొందరు తలంబ్రాలను ఇళ్లలో దేవుళ్ల చిత్రపటాల వద్ద ఉంచి పూజలు చేస్తే.. ఇంకొందరు పంట భూముల్లో చల్లితే దిగుబడి పెరుగుతుందని నమ్ముతారు. ఇంతటి విలువైన తలంబ్రాలను భక్తిశ్రద్ధలతో పండించి.. స్వయంగా గోటితో వలిచి స్వామి వారికి సమర్పించేందుకు దేశ నలుమూలల నుంచి భద్రగిరికి వస్తారు. రామయ్య కల్యాణ పనులు మొదలైన రోజునే తలంబ్రాలను కలపడం ఆనవాయితీ కావడంతో ఎప్పటిలాగే పౌర్ణమి రోజు జరిగిన ఈ క్రతువుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుదూర ప్రాంతాల భక్తులు గురువారం రాత్రికల్లా భద్రాచలం చేరుకోగా.. శుక్రవారం ఉదయం ఆలయ ఆవరణలో తలంబ్రాలు కలిపే కార్యక్రమానికి తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొనగా.. రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
కాలినడకన సైతం..
భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణంలో వినియోగించే తలంబ్రాలను పండించేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ఈ క్రమాన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల భక్తులు తమ భూముల్లో భక్తి శ్రద్ధలతో వరినాట్లు వేసి పంట పండించాక... ధాన్యాన్ని గోటితో వలిచి తలంబ్రాలు సిద్ధం చేస్తారు. ఆపై కాలినడకన భద్రగిరికి వచ్చిన పలువురు దేవస్థానంలో ప్రధాన అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించి రామయ్యకు సమర్పించారు. ఇలా భక్తులు సమర్పించిన తలాంబ్రాలతో పాటు దేవస్థానం తరఫున తలంబ్రాలు, ముత్యాలను కలిపి సీతారాముల కల్యాణంలో వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది.
తలంబ్రాలు కలిపేందుకు వచ్చాం
ఏటా సీతారాముల కల్యాణంలో వినియోగించే తలంబ్రాలు కలిపేందుకు బంధువులతో వస్తున్నా. రామనామ స్మరణతో తలంబ్రాలు కలుపుతుంటే సంతోషంతో మనసు పులకించిపోతుంది. పదేళ్లుగా వస్తున్నా ఎప్పటికీ కొత్త అనుభూతే ఉంటుంది.
–రమణ, హైదరాబాద్
సీతారామా.. తలంబ్రాలు ఇవిగో..!
సీతారామా.. తలంబ్రాలు ఇవిగో..!