అశ్వారావుపేటరూరల్: దశాబ్దాల కాలంగా పంట పొలాలకు సాగునీరు అందించి ఆయకట్టు రైతులకు అన్నం పెట్టిన పెదవాగు ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం వచ్చేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు అన్నారు. మండలంలోని గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టు ఆనకట్టకు గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షాలు, వరద కారణంగా గండ్లు పడగా, ఆయన గురువారం పరిశీలించారు. ముందుగా ప్రాజెక్ట్ వద్దగల శ్రీ గంగానమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం ఆయకట్టు రైతులతో సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల కిందటే తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులను కలిసి పెదవాగు ప్రాజెక్ట్ పరిస్థితి వివరించానని, కమిషన్ సభ్యులు ఈ నెల 17వ తేదీన ప్రాజెక్టును పరిశీలించేందుకు వస్తున్నారని, ఆయకట్టు రైతులంతా అందుబాటులో ఉండి వారికి సమస్య, ప్రాజెక్టు స్థితిగతులను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో నారాయణపురం సొసైటీ చైర్మన్ నిర్మల పుల్లారావు, రైతులు సత్యనారాయణ, వేలేరుపాడు రైతులు అమరవరపు అశోక్, పిట్టా ప్రసాద్ పాల్గొన్నారు.