మణుగూరుటౌన్: మూడు పంటలు పండే భూములు ఇచ్చిన రైతులతో సింగరేణి అధికారులు కూలీ పనులు చేయించాలని భావిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూరు ఓసీ విస్తరణలో భాగంగా భూసేకరణకు కొత్త కొండాపురం వద్ద గువారం పిసా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత భూసేకరణ ప్రత్యేకాధికారి సుమ మాట్లాడుతూ.. భూమి కోల్పోతున్న గిరిజనులకు ఎకరాకు రూ.22.50 లక్షలు, ఆర్‌అండ్‌ఆర్ కింద రూ.5.50 లక్షలు అందిస్తామని, గిరిజనేతరులకు చట్టప్రకారం పరిహారం చెల్లించడమే కాక సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అలాగే, చెరువులో సగ భాగం సింగరేణి తీసుకుంటున్నందున రూ.17 కోట్లతో మరో వైపు చెరువును విస్తరిస్తామని పేర్కొన్నారు. సింగరేణి ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడుతూ.. మణుగూరు ఓసీ విస్తరణతో మరో 20 ఏళ్ల భవిష్యత్ ఉంటుందని, రెండు దశాబ్దాలు ఉపాధి లభిసుందన్నారు. దీంతో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. పెద్దచెరువు విస్తీర్ణం గతంలో 90 ఎకరాలు ఉండేదని ఓసీ ఏర్పాటులో కొంత భాగం గతంలోనే పోయినా మత్స్యకారులకు న్యాయం జరగలేదని, ఇప్పుడు మిగిలిన చెరువును తీసుకుంటామనడం సరికాదన్నారు. మత్స్యకారులకు హామీ ఇవ్వకుండా భూసేకరణకు సిద్ధం కావడం ఏమిటని ప్రశ్నించారు. కాగా, నర్సింహ అనే వ్యక్తి తన భూములు మూడు సార్లు సింగరేణి సేకరిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగం, పరిహారం కూడా ఇవ్వలేదని వాపోయారు. పద్మగూడెం, కొమ్ముగూడెం గ్రామాలను సింగరేణి తీసుకున్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి, తమకు మాత్రం ఎందుకు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భూసేకరణకు ఆమోదం తెలపాలని అధికారులు కోరగా, ఉద్యోగాలు ఇచ్చి, చెరువుపై ఆధారపడిన మత్స్యకారుల పరిస్థితిపై స్పష్టత ఇచ్చేవరకు భూములు ఇవ్వబోమని స్థానికులు తేల్చిచెప్పి వెనుదిరిగారు. గ్రామసభ అధ్యక్షుడు చందా నాగేశ్వరరావుతో పాటు గనిబోయిన కన్నయ్య, సున్నం మంగయ్య, కుర్రం రవి, కారం నర్సింహారావు, కోడి నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
శ్మశానవాటికకు నిధులు కేటాయించాలి
సింగరేణి పునరావాస గ్రామాలైన కొత్త కొండాపురం, కొత్త కొమ్ముగూడెం గ్రామాల్లో శ్మశానవాటికల నిర్వహణకు నిధులు కేటాయించాలని నిర్వాసితులు ఇఫ్టూ ఆధ్వర్యాన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమకు వినతిపత్రం ఇచ్చారు. దీంతో ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థలంలో పిచ్చిమొక్కలు తీయించాలని అధికారులకు సూచించారు.
మెరుగైన పరిహారం ఇవ్వాలి
మణుగూరురూరల్: ఓసీ విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులందరికీ మెరుగైన పరిహారం చెల్లించాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమకు వినతిపత్రం అందజేశారు. బీఆర్‌ఎస్ మండల కన్వీనర్, సొసైటీ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావుతో పాటు తాళ్లపల్లి యాదగిరిగౌడ్, పి.శ్రీనివాస్, జావీద్, రంజిత్‌కుమార్ పాల్గొన్నారు.
ఓసీ విస్తరణ భూసేకరణ సభలో
గ్రామస్తుల ఆగ్రహం