బూర్గంపాడు: నిరుపేద, ఒంటరి, వితంతు మహిళలకు వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి, వారి జీవనోపాధికి ఐటీసీ సహకారం అందిస్తుందని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. సారపాకలోని ఐటీసీ కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమానికి పీఓతో పాటు పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. పేద మహిళల ఆసక్తిని గుర్తించి వారికి అయా రంగాల్లో ఐటీసీ శిక్షణ ఇస్తుందన్నారు. ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి ఏజెన్సీ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఐటీసీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సీఎస్సార్ నిధులతో గ్రామాల్లో మౌలికవసతులు, విద్య, వైద్య రంగాల్లో అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఏజెన్సీలోని పేదల ఆర్థికాభివృద్ధికి ఐటీసీ అన్ని విధాల చేయూతనందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఐటీసీ పీఎస్‌పీడీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్, జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్) శ్యామ్‌కిరణ్, చెంగలరావు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యేలు పాయం, తెల్లం