‘భరోసా’ ఎప్పుడో ? | - | Sakshi
Sakshi News home page

‘భరోసా’ ఎప్పుడో ?

Feb 6 2025 12:19 AM | Updated on Feb 6 2025 12:19 AM

‘భరోసా’ ఎప్పుడో ?

‘భరోసా’ ఎప్పుడో ?

● పెట్టుబడి సాయం కోసం నిరీక్షణ ● మండలానికి ఒక గ్రామంలోనే అందిన రైతు భరోసా ● ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో అన్నదాతల్లో ఆందోళన

బూర్గంపాడు: పంటల సాగుకు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతు భరోసా కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు సంబంధించిన సాయం అందనే లేదు. యాసంగి పంటల సాగుకు జనవరి 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడి రైతులకు మాత్రమే ‘భరోసా’ అందించారు. దీంతో మిగతా గ్రామాల రైతులు తమకు సాయం అందేదెప్పుడో అని నిరీక్షిస్తున్నారు. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడంతో రైతు భరోసాపై అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. మరో వారం రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడుతుందనే ఊహగానాలతో ఈ భయం మరింతగా పెరిగింది. ఎన్నికల కోడ్‌కు ముందే రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో ఇబ్బందులు ఉండకపోవచ్చని కొందరు అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.

వానాకాలంలో మొండిచేయి..

ఈ ఏడాది వానాకాలం పంటలకు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందించలేదు. యాసంగి సాగుకై నా పెట్టుబడి సాయం అందుతుందా అని రైతులు ఆలోచనలో పడ్డారు. ఇంతలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రిపబ్లిక్‌ డే సందర్భంగా నాలుగు పథకాలను అట్టహాసంగా ప్రారంభించారు. అందులో రైతు భరోసా కూడా ఉండటంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇంతలోనే మండలానికి ఓ గ్రామం చొప్పున తొలి విడత పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించి నిధులు ఆయా రైతుల ఖాతాల్లో జమచేసింది. దీంతో మిగిలిన గ్రామాల రైతులు పెట్టుబడి ఖర్చులకు డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎకరాకు రూ. 6 వేలు పెట్టుబడి సాయం అందుతుందని భావించారు. డిసెంబర్‌ నుంచే యాసంగి పంటల సాగుకు ఉపక్రమించారు. ఇప్పటికే యాసంగి వరినాట్లు వేసిన రైతులు రెండు విడతల ఎరువులు కూడా వేసుకున్నారు. పెట్టుబడి సాయం ఆలస్యమైతే యాసంగి సీజన్‌ పూర్తవుతుందని, పంటల సాగు సమయంలోనే రైతు భరోసా అందిస్తే ఎరువులకు, కూలీలకు ఉపయోగపడతాయని రైతులు అంటున్నారు.

ఇప్పుడు 25 గ్రామాల్లోనే..

గత నెల 26వ తేదీన జిల్లాలోని 23 మండలాల్లో 25 గ్రామాలకు చెందిన 22, 242 మంది రైతులకు రూ. 39.06 కోట్లు రైతు భరోసా కింద వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. మిగిలిన గ్రామాల రైతులకు భరోసా ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి. ప్రభుత్వం మార్చి 31 వరకు రైతు భరోసా కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెబుతోంది. అయితే ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఇది మార్చి 3 వరకు అమల్లో ఉంటుంది. మరో వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారనే ప్రచారంతో రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.

రైతు భరోసా వెంటనే అందించాలి

రైతులకు సకాలంలో రైతు భరోసా పెట్టుబడి సాయమందిస్తే ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వం జనవరి 26న రైతు భరోసా అందిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ ఊరి రైతులకే అందించింది. మిగితా రైతులకు కూడా వెంటనే సాయం అందించాలి.

– దుప్పటి రాజు, రెడ్డిపాలెం

పంట కాలంలోనే ఇవ్వాలి

పంటలు సాగు చేసేటప్పుడే పెట్టుబడి సాయం అందిస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. ప్రైవేటు అప్పులు తీసుకోకుండా రైతు భరోసాను పెట్టుబడులకు వాడుకుంటాం. వానాకాలం సాయమందలేదు. కనీసం యాసంగికి కూడా సకాలంలో అందే పరిస్థితి కనిపించటం లేదు.

– ఆవుల శ్రీనివాసరెడ్డి, నాగినేనిప్రోలు

ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే..

ప్రభుత్వ నిర్ణయం మేరకే రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమవుతుంది. సాగుకు యోగ్యమైన భూముల వివరాల నివేదికను ప్రభుత్వానికి పంపించాం. తొలి విడతగా మండలానికి ఓ రెవెన్యూ గ్రామానికి చెందిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమైంది. మిగతా గ్రామాల రైతులకు కూడా త్వరలోనే జమవుతుందనే సమాచారం ఉంది.

– తాతారావు, ఏడీఏ, మణుగూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement