వేధిస్తున్న ‘గ్యాస్‌’ కొరత | - | Sakshi
Sakshi News home page

వేధిస్తున్న ‘గ్యాస్‌’ కొరత

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

వంటగ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం

బ్లాక్‌లో రూ.2,500కు

విక్రయిస్తున్న దళారులు

52 మందిపై కేసు నమోదు చేసిన అధికారులు

కొందరు డీలర్లు కూడా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు

తనిఖీలు చేస్తున్నాం

పాల్వంచరూరల్‌: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో ఎల్పీజీ గ్యాస్‌ కొరత వినియోగదారులను వేధిస్తోంది. సిలిండర్లు అందక హోటళ్లు మూసివేసే పరిస్థితి నెలకొంది. బుక్‌ చేసుకున్నాక రెండు, మూడు రోజులకు అందించాల్సిన గృహ వినియోగ సిలిండర్లను ఆలస్యంగా సరఫరా చేస్తున్నారు. ఒకసారి గ్యాస్‌ బుక్‌ చేసుకున్నాక, మళ్లీ రెండోసారి బుక్‌ చేసుకునేందుకు 45 రోజుల సమయం పడుతోంది. ఇక శుభకార్యాలు జరుపుకుంటే కట్టెల పొయ్యిపై వంటలు చేసుకుంటున్నారు. గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు లేవని పౌరసరఫరాల శాఖ అధికారి చెబుతున్నా క్షేత్రస్థాయిలో వినియోగదారులకు అవస్థ తప్పడం లేదు.

బ్లాక్‌లో విక్రయిస్తున్న కొందరు డీలర్లు

జిల్లాలో 4,69,075 మంది గ్యాస్‌ వినియోగదారులు ఉండగా, వీరిలో సింగిల్‌ గ్యాస్‌ సిలిడర్లు కలిగినవారు 2,41,175 మంది, డబుల్‌ సిలిండర్‌ కలిగినవారు 98,868 మంది, దీపం కనెక్షన్లు 53,405, సీఎస్‌ఆర్‌ కనెక్షన్లు 2,465, ఉజ్వల కనెక్షన్లు 73,162 ఉన్నాయి. జిల్లాలో రోజుకు నాలుగువేలకు పైగా బుకింగ్‌లు జరుగుతున్నాయి. అయితే బుక్‌ చేసుకున్నా గ్యాస్‌ సరఫరా జరగడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు బ్లాక్‌లో ఒక్కో సిలిండర్‌ రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని కొనుగోలు దారులు చెబుతున్నారు. కొందరు డీలర్లు కూడా బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

364 సిలిండర్లు స్వాధీనం

బ్లాక్‌ సిలిండర్ల విక్రయిస్తుండగా, పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారుల తనిఖీల్లో 364 సిలిండర్లు పట్టుబడగా, 52మందిపై 6ఏ కేసు నమోదు చేశారు. కొత్తగూడెంలో 11 సిలిండర్లు, లక్ష్మీదేవిపల్లిలో 17, జూలూరుపాడులో 34, దమ్మపేటలో 36, భద్రాచలంలో 24, మణుగూరులో 172, సుజాతనగర్‌లో 70 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో గ్యాస్‌ కొరత లేదు. వినియోగదారులు బుక్‌చేసుకుంటే 45 రోజుల్లో డెలివరీ ఇస్తున్నారు. ఓటీపీ ద్వారా మాత్రమే గ్యాస్‌ వినియోగదారునికి అందుతుంది. ఎక్కడా బ్లాక్‌ చేసే అవకాశంలేదు. గృహ వినియోగ సిలిండర్లు కమర్షియల్‌గా వినియోగిస్తే కేసులు నమోదు చేస్తున్నాం. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెంచాం. ఇటీవల పలు ప్రాంతాల్లో దాడులు చేసి కేసులు నమోదు చేశాం. బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం.

–ప్రేమ్‌కుమార్‌,

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement