పెద్దమ్మతల్లికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్‌ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

మహనీయుల

ఆశయాలు సాధించాలి

కలెక్టర్‌ అంకిత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): మహనీయుల ఆశయాలను సాధించాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన ఈకార్యక్రమాన్ని కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ సామాజిక న్యాయ సాధనకు కృషి చేశారని కొనియాడారు. ఎస్పీ రోహిత్‌ రాజు, అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌, కొత్తగూడెం మేయర్‌ మూడ్‌ గణేష్‌, జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖాధికారి ఎం.శ్రీలత, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌ పాషా, జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌ దాసరి శ్రీనివాస్‌, కో కన్వీనర్లు చదలవాడ సూరి, కూసపాటి శ్రీనివాస్‌, మంద హనుమంతు, మద్దెల సూరి తదితరులు పాల్గొన్నారు.

నేడు ప్రజావాణి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై లిఖిత పూర్వక ఫిర్యాదులను అందజేయాలని సూచించారు.

ఉత్పత్తి లక్ష్యాలు

అధిగమించాలి

సింగరేణి డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు

టేకులపల్లి: రోజువారీ బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను అధిగమించాలని సింగరేణి డైరెక్టర్‌(ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్లానింగ్‌) కె.వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం ఆయన ఇల్లెందు ఏరియాలోని ఇల్లెందు, కోయగూడెం ఓపెన్‌కాస్టుల్లో పర్యటించారు. కేఓసీ వ్యూ పాయింట్‌ నుంచి పని స్థలాలను పరిశీలించారు. ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్‌, లోడింగ్‌ పనుల వివరాలను జీఎం వి.కృష్ణయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో నూతన జేకే ఓసీ ప్రాజెక్ట్‌ రికార్డులు, ప్రణాళికలను పరిశీలించారు. ప్రాజెక్ట్‌ పురోగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఆ తర్వాత నూతన ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న రోడ్డు, తదితర పనులను పరిశీలించారు. జేకే కాలనీలోని సీ–2 క్వార్టర్లను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. అధికారులు రామస్వామి, జాకీర్‌ హుస్సేన్‌, అజ్మీర తుకారాం, రవికుమార్‌, పూర్ణచందర్‌, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement