గత నవంబర్‌లో పీఏసీఎస్‌ల
పాలకవర్గాలు రద్దు
ఆరు నెలలుగా పర్సన్ ఇన్‌చార్జిలతో నిర్వహణ
ఎన్నికలు నిర్వహిస్తారా?
నామినేటెడ్ నియామకాలా?
ఎటూ స్పష్టతలేక సభ్యులు, ఆశావహుల్లో ఆందోళన
బూర్గంపాడు: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల కోసం ఆశావహులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. పదవీకాలం ముగిశాక కూడా ఏడాదిన్నరపాటు కొనసాగించిన ప్రభుత్వం గత నవంబర్‌లో పాలకవర్గాలను రద్దు చేసింది. అప్పటినుంచి పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఆరు నెలలుగా పర్సన్ ఇన్‌చార్జ్‌ల పాలనే సాగుతుండగా, పాలకవర్గాలు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈసారి ప్రభుత్వం పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్లను, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక చేయాలని యోచించింది. అయితే ప్రస్తుతం ఆ ప్రతిపాదన కూడా అటకెక్కినట్లు తెలుస్తోంది. పర్సన్ ఇన్‌చార్జ్‌లతోనే పాలన కొనసాగిస్తారా? ఎన్నికలు నిర్వహిస్తారా? నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమిస్తారా? అనే చర్చ సంఘ సభ్యుల్లో సాగుతోంది.
పర్సన్ ఇన్‌చార్జిలతో పాలనా వైఫల్యం..
జిల్లాలో 21 పీఏసీఎస్‌లు రైతులకు సేవలందిస్తున్నాయి. వ్యవసాయ రుణాలు ఇవ్వటంతోపాటు రైతులకు ఎరువుల విక్రయాలు, ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా పనిచేస్తున్నాయి. డీసీసీబీ నుంచి వ్యవసాయ భూములపై మార్ట్‌గేజ్ రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణకు రుణాలు, పశుపోషణకు రుణాలు, బంగారంపై రుణాలు అందిస్తున్నాయి. జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఎరువుల విక్రయాలు సాగుతున్నాయి. ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా, కాంప్లెక్స్ ఎరువుల ధరలు అధికంగా ఉండటంతో రైతులు పీఏసీఎస్‌ల్లోనే కొంటున్నారు. యూరియా 80శాతం మేర సొసైటీల నుంచే రైతులకు అందుతోంది. పీఏసీఎస్‌లు 88 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నాయి. రాయితీపై వరి, కంది, పెసర, మినుము, జనుము, జీలుగ విత్తనాలను కూడా విక్రయిస్తున్నాయి. తద్వారా ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. 2004కు ముందు నిర్వీర్యమైన పీఏసీఎస్‌ల్లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జవ సత్త్వాలు నింపాడు. అప్పటి నుంచి ఆర్థిక పరిపుష్టి సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత తరుణంలో పాలకవర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం కో ఆపరేటివ్ అధికారులనే పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించటంతో పాలనా వైఫల్యాలు కనిపిస్తున్నాయని సంఘ సభ్యుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సకాలంలో ఎరువులు అందటం లేదని, ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.


