స్నేహితుల దినోత్సవం నాడే.. ఈ స్నేహితులకు చివరి రోజు.. | - | Sakshi
Sakshi News home page

స్నేహితుల దినోత్సవం నాడే.. ఈ స్నేహితులకు చివరి రోజు..

Aug 7 2023 1:22 AM | Updated on Aug 7 2023 9:16 AM

- - Sakshi

భద్రాద్రి: స్నేహితులతో కలిసి సంబురాలు జరుపుకున్న కొద్దిసేపటికే అందులోని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బైక్‌పై వెళ్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో తోటి స్నేహితుల్లో విషాదం అలుముకుంది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కేఎల్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న పాల్వంచ నవభారత్‌కు చెందిన ఏనిగ ఉపేందర్‌రెడ్డి కుమారుడు మధూకర్‌రెడ్డి (20), వరంగల్‌ జిల్లా నర్సంపేట మాదన్నపేట గ్రామానికి చెందిన దూడల శ్రీను కుమారుడు శివ (20)లు ఆదివారం సాయంత్రం బైక్‌పై నవభారత్‌ వైపు వెళ్తూ ఎన్‌ఎండీసీ కర్మాగారం సమీపంలో డివైడర్‌కు ఢీకొట్టారు.

దీంతో ఇద్దరు ఎగిరి ముందుకు పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొత్తగూడెం ట్రాఫిక్‌ ఎస్‌ఐ నరేశ్‌, పట్టణ ఎస్‌ఐ బి.రాములు ఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

సంబురాలు.. అంతలోనే విషాదం..
ఆదివారం సెలవు కావడంతో పాటు స్నేహితుల దినోత్సవం కాగా నవభారత్‌లో ఉంటున్న మధూకర్‌రెడ్డి మోటార్‌ సైకిల్‌పై పాల్వంచకు వచ్చాడు. కొద్దిసేపు స్నేహితులంతా కలుసుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు మద్యం కూడా సేవించినట్లు స్థానికులు తెలిపారు.

అనంతరం మధూకర్‌రెడ్డి.. శివను మోటార్‌ సైకిల్‌పై ఎక్కించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో డివైడర్‌కు ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యారు. మధూకర్‌రెడ్డి మృతి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలోకి వెళ్లారు. శివ ప్రమాదంపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బి.రాము తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement