ఆటో నడిచేదెలా..? | - | Sakshi
Sakshi News home page

ఆటో నడిచేదెలా..?

Jul 27 2026 1:48 AM | Updated on Jul 27 2026 1:48 AM

చంద్రబాబు పాలనలో ఆటోడ్రైవర్లకు కష్టాలు ● ఇంధన ధరలు, రుసుముల మోత ● దేశంలోనే ఏపీలో అధిక వ్యాట్‌ భారం ● విడిభాగాల ధరల పెంపు అదనం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

కూలీలుగా మారుతున్న వైనం

ఆర్థిక పరిస్థితి దిగజారింది

చంద్రబాబు పాలనలో ఆటోడ్రైవర్లకు కష్టాలు
చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా మారింది. అడ్డగోలు జీవోలు, నిత్యం పెరిగిపోతున్న ధరలతో వారు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతో రెక్కాడితేగానీ డొక్కాడని వేల మంది సామాన్య ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఆటో విడిభాగాలు, మెయింటనెన్స్‌ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో వారు కుదేలు అవుతున్నారు. దీనికితోడు రుసుములు, జరిమానాల పెంపుతో కష్టాలపాలవుతున్నారు.

పట్నంబజారు: ప్రస్తుత కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థితిగతులు, అవసరాలు మారడంతో దాదాపు ప్రతి ఇంటికీ ఒకటి లేదా రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వ్యక్తిగత వాహనాలు పెరిగిపోవడంతో ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప ఆటో ఎక్కేందుకు మొగ్గు చూపడం లేదు. పల్లెలను, పట్టణాలను అనుసంధానించే భారీ ‘సెవెన్‌ సీటర్‌’ ఆటోలు నిషేధానికి గురయ్యాయి. నగరంతోపాటు అనేక ప్రధాన ప్రాంతాల్లో తిరిగే త్రీ సీటర్స్‌, ఫోర్‌ సీటర్స్‌ ఆటోలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించినా అరకొర ఆదాయం దిక్కువుతోంది. రోజువారీ ఇంధన ఖర్చులకే సంపాదన సరిపోతోంది. ఏటా కట్టాల్సిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఫీజులు, బీమా ప్రీమియం, ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లించలేక డ్రైవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తమ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై ఇంధనం అందించాలని, ఫైనాన్స్‌ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని జిల్లా ఆటో కార్మిక సంఘాలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి.

జీవోల రద్దుకు విజ్ఞప్తి

రాష్ట్రంలో ముఖ్యంగా సీ్త్ర శక్తి పథకం ప్రారంభించిన తరువాత ఆటోవాలాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మహిళలు ఆటోలు ఎక్కే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో ప్రభుత్వ సేవల ఫీజులు పెంచుతూ, భారీ జరిమానాలు విధించేలా తెచ్చిన జీవో 21, 31 లు ఆటోవాలాలకు మరింత గుదిబండగా మారాయి. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. థర్డ్‌ పార్టీ బీమా రూ. ఆరు వందలకు తగ్గించాలని, ప్రైవేట్‌ సంస్థల పరిధిలోని వాహన ఫిట్‌నెస్‌ పరీక్షలను రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయాలతో కూడిన ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. తమను ఆదుకోవాలని ఆటో కార్మికులు కోరుతున్నారు.

నేను ఏళ్లుగా ఆటో నడుపుతున్నా. ఇదే జీవనాధారం. డీజిల్‌, ఇతర ఖర్చులు పోను రోజుకు రూ.200 కూడా మిగిలడం లేదు. రోడ్డుపై ఆటో నిలుపుకొనే పరిస్థితి లేకుండా పోతోంది. బిడ్డల చదువులు.. పెద్దల వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చంద్రబాబు ప్రభుత్వం ఆటో రంగానికి చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆటోవాలాలను ఇబ్బందికి గురి చేసేలా తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలి.

– శేషగిరి పవన్‌కుమార్‌, ఆటో యూనియన్‌ నాయకుడు

ఆటోడ్రైవర్ల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారిపోతోంది. ఇప్పటికే ఉచిత బస్సు పథకంతో కిరాయిలు లేక బతుకులు చితికిపోయాయి. ప్రభుత్వం వెంటనే వ్యాట్‌, సెస్‌లను రద్దు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.చంద్రబాబు ఆటోవాలాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో వాహనమిత్ర సాయం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలు కల్పిచడంతోపాటు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.

– మేడా మురళి,

ఆటోడ్రైవర్‌, ఏటీ అగ్రహారం

రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోలకు నెలవారీ ఈఎంఐలు, ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్‌ ఫీజులు కట్టలేక నిస్సహాయ స్థితిలో ఆటోడ్రైవర్లు కొట్టుమిట్టాడుతున్నారు. ఉపాధి కోల్పోయిన అనేకమంది డ్రైవర్లు పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్న దుస్థితి ఏర్పడింది. ఇంధనం లీటరుపై ఇతర రాష్ట్రాల్లో వ్యాట్‌ రూ.25 నుంచి రూ.28 లోపు ఉంటే.. ఏపీలో అత్యధికంగా రూ.30 ఉందని ఆటో, మోటారు వర్కర్స్‌ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ తరహాలో పన్ను తగ్గిస్తే రవాణా రంగానికి, సామాన్యులకు కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. కూటమి సర్కార్‌ ఈ దిశగా కూడా యోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు తగ్గినప్పటికీ ఏపీలో ఇంధన ధరలు పెంచడంపై ఆటోడ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఆయిల్‌ కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకునే అనుమతులను రద్దు చేయటంతోపాటు ధరలపై నియంత్రణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement