మద్యంమత్తులో భార్యను హత్య చేసిన భర్త | - | Sakshi
Sakshi News home page

మద్యంమత్తులో భార్యను హత్య చేసిన భర్త

May 19 2026 1:46 AM | Updated on May 19 2026 1:46 AM

మేడికొండూరు: మద్యం మత్త ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో ఓ భర్త కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన మండలం పేరేచర్లలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గోదావరి జిల్లా భీమవరానికి చెందిన నంబూరు వెంకటేశ్వర్లు(23), లక్ష్మి(20) దంపతులు రెండు వారాల క్రితం పేరేచర్ల గ్రామానికి వలస వచ్చారు. ఇక్కడి ఎల్‌ఎన్‌ఎస్‌ కాలనీ ఒకటో లైన్‌ పరిసరాల్లో రోడ్డు పక్కన తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. వీరు రోజూ గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ బాటిళ్లులు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే సోమవారం కూడా కాగితాలు ఏరుకుని వచ్చిన వెంకటేశ్వర్లు.. తీవ్రంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్య లక్ష్మితో ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులో పూర్తిగా విచక్షణ కోల్పోయిన వెంకటేశ్వర్లు.. తీవ్ర ఆగ్రహంతో కూరగాయలు కోసే కత్తిని తీసుకుని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఘటనా స్థలంలో సీఐ దర్యాప్తు..

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మేడికొండూరు సీఐ మధుసూదన్‌రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మీ మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. నిందితుడు వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ కేసు నమోదు చేసి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. సీఐ వెంట ఎస్‌ఐ ఖాజీబాబు ఉన్నారు.

కూరగాయలు కోసే కత్తితో ఘాతుకానికి

ఒడిగట్టిన వైనం

Advertisement
 
Advertisement
Advertisement