● ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్
యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ
● ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరసన
రేపల్లె: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం తాత్సారం చేయటం తగదని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. గతంలో 42 రోజుల పోరాటంతో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసి, వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ విధానంలో మార్పులు చేసి అందరికీ వర్తించేలా చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి సీహెచ్.మణిలాల్ మాట్లాడుతూ 22 నెలలుగా వేతనాల పెంపుదల లేకపోవడం అంగన్‌వాడీలను నిరాశకు గురిచేస్తోందన్నారు. ఇతర ఖర్చులపై దృష్టి పెట్టే ప్రభుత్వం, అంగన్‌వాడీల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీడీపీవో ఎం.సుచిత్రకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కే.రత్నకుమారి, నిర్మల జ్యోతి, ఎన్.కష్ణకుమారి, డి.జ్యోతి, జయప్రద, అమల, శారద, రాజ్యలక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు. నిజాంపట్నం మండలం పల్లపట్ల ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు వై.మేరీమణి, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.


