ఇంకొల్లు(చినగంజాం): చంద్రబాబు ప్రభుత్వంలో తాగునీరు దొరకదేమో కాని మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతోంది. మండలంలోని పూసపాడు గ్రామంలో మందుబాబుల ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మద్యం ప్రియులు గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతూ మహిళలను, చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రామంలో మందుబాబుల విచ్చలవిడితనం విపరీతంగా పెరిగి పోతోంది. వీధుల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితికి గ్రామ వాతావరణాన్ని తీసుకువస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వీధుల్లో తిరగాలంటే భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలోని అరుగులు, వీధులు, ఖాళీ ప్రదేశాలు, చిన్నకొద్ది డొంకలు, ఆఖరుకు పొలాలకు వెళ్లే బహిరంగ ప్రదేశాలలో మందుబాబులు తమ పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మహిళలు పొలం పనులకు వెళ్లాలంటే అక్కడ మందుబాబులు తిష్ట వేసి ఉంటారేమో అన్న భయానికి గురవుతున్నారు. పొలానికి వెళ్లాలన్నా, ఇంటికి తిరిగి రావాలన్నా కష్టంగా మారింది. గ్రామంలో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు నిత్యం దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో ప్రధాన సమస్యగా మందుబాబుల వ్యవహారం తయారైంది. ఈనేపథ్యంలో పోలీసులు గ్రామంలో నిఘా పెట్టి బహిరంగంగా మద్యం తాగుతూ ప్రజలకు ఇబ్బందులకు కలుగజేస్తున్న మందుబాబులను దండించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


