చెరువు కొలతలు నిర్వహించనున్న నేపథ్యంలో.. టీడీపీలో గ్రూపుల పోరు
కొల్లూరు : స్వర్ణ గ్రామ కార్యాలయానికి టీడీపీలోని ఓ వర్గం నాయకులు తాళాలు వేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... మండలం లోని క్రాప స్వర్ణ గ్రామ కార్యాలయం స్వీపర్ శుభ్రం చేసి తలుపులకు గడియ పెట్టి వెళ్లాడు. పంచాయతీ సెక్రటరీ కార్యాలయంలో ఉండగా టీడీపీలోని ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కార్యాలయానికి తాళాలు వేశారు. క్రాప గ్రామంలోని ఓ చెరువు వ్యవహారంలో టీడీపీకి చెందిన వర్గాల మధ్య వివాదం నడుస్తుంది. మంగళవారం చెరువు కొలతలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో కోర్టులో కేసు నడుస్తుండగా కొలతలు ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీకి చెందిన మరో వర్గం వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్వర్ణ గ్రామ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. చెరువు వ్యవహారం కోర్టులో ఉండగా పంచాయతీ కార్యదర్శి ఓ వర్గానికి కొమ్ముకాస్తూ తమకు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వర్గానికి చెందిన కుటుంబం ఇచ్చిన స్థలంలో నిర్మించిన కమ్యూనిటీ భవనంలో స్వర్ణ గ్రామ కార్యాలయం తొలగించాలంటూ కార్యాలయానికి తాళాలు వేశారు. కార్యాలయానికి తాళాలు వేసి ఉండడాన్ని చూసి సిబ్బంది అవాక్కయ్యారు. కొద్ది సమయం అనంతరం కార్యాలయానికి వేసిన తాళాలను పగలగొట్టి తలుపులు తెరసి సిబ్బంది విధులు నిర్వహించారు.


