ఆధునిక సాంకేతిక వ్యవసాయంపై మొగ్గుచూపాలి | - | Sakshi
Sakshi News home page

ఆధునిక సాంకేతిక వ్యవసాయంపై మొగ్గుచూపాలి

Mar 27 2026 8:51 AM | Updated on Mar 27 2026 8:51 AM

ఆధునిక సాంకేతిక వ్యవసాయంపై మొగ్గుచూపాలి అపరిశుభ్రతతో వ్యాధులు వ్యాప్తి మత్తుకు బానిసైతే జీవితం అంధకారం పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి

రేపల్లె: రైతులు సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఆధునిక సాంకేతికత వైపు దృష్టిసారించాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అద్దేపల్లి లక్ష్మి తెలిపారు. మండలంలోని నల్లూరుపాలెం గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ, ఆత్మల సంయుక్త ఆధ్వర్యంలో సాంప్రదాయ వ్యవసాయంలో సుస్థిరత సాధించే సాంకేతిక నైపుణ్యాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతుల నైపుణ్యాలను గుర్తించి ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న రైతులకు సర్టిఫికెట్‌లను అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అవ్వారు మహేష్‌బాబు, ఏఈఓలు కె.సుమంత్‌, ఎంపీఈఓ సతీష్‌, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

నల్లమోతువారిపాలెం(కర్లపాలెం): పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల వ్యాధులు ప్రబలుతాయని నల్లమోతువారిపాలెం కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ కె.అనూష తెలిపారు. బాపట్ల ఉమెన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు నల్లమోతువారిపాలెంలో నిర్వహిస్తున్న సేవా శిబిరంలో అపరిశుభ్రత వ్యాధులపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అనూష మాట్లాడుతూ.. కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడంతో వ్యాధులు వస్తాయని చెప్పారు. గ్రామస్తులు తమ గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు శివనాగమణి, సుబ్బలక్ష్మి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కృష్ణకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

బాపట్ల టౌన్‌: యువత మత్తుకు బానిసైతే జీవితం అంధకారం అవుతుందని వెదుళ్లపల్లి ఎస్‌ఐ భాగ్యరాజ్‌ తెలిపారు. మండలంలోని వెదుళ్లపల్లి జీబీసీ రోడ్డుపై మాదకద్రవ్యాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, ట్రాఫిక్‌ రూల్స్‌పై గురువారం ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్‌ఐ భాగ్యరాజ్‌ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువతను వ్యసనాలకు బానిసలుగా మార్చి, వారి ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ, భవిష్యత్తును దెబ్బతీస్తుందన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. కార్యక్రమంలో ఈగిల్‌ టీమ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ సురేష్‌, వెదుళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కర్లపాలెం: ఇంటి పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు కోరారు. కర్లపాలెంలో ఇంటి పన్నుల వసూలు కోసం గురువారం వినూత్నంగా ప్రచార కార్యక్రమం చేపట్టారు. తన కారుపై సౌండ్‌బాక్స్‌లు ఏర్పాటు చేసి వీధులో తిరుగుతూ ఇంటి పన్నులు చెల్లించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీడీఓ గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందితో కలిసి పన్నులు చెల్లించాల్సిన వారి ఇళ్లకు వెళ్లి ఇంటి పన్నులు చెల్లించాలని కోరారు. మండలంలో ఇప్పటి వరకు 9 పంచాయతీలలో నూరుశాతం పన్నుల వసూలు పూర్తయిందని తెలిపారు. మిగిలిన పంచాయతీలలో ఈనెలాఖరు లోపు పన్నుల వసూలు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. డెప్యూటీ ఎంపీడీఓ దొంతిరెడ్డి పద్మావతి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement