చెరుకుపల్లి: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చెరుకుపల్లి మండల పరిసర గ్రామాల్లో ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాల వద్ద చలువ పందిళ్లు, ఆలయాలకు విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మండల కేంద్రంలో ఉన్న వీరరాఘవపేటలో కృష్ణబలిజ వారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటలకు 68వ వార్షిక స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. గుళ్ళపల్లి రజక సంఘం ఆధ్వర్యంలో 23వ వార్షికోత్సవం, గౌడ సంఘం ఆధ్వర్యంలో 19వ వార్షికోత్సవ శ్రీ సీతారాముల వసంత నవరాత్రి కల్యాణ మహోత్సవాలు నిర్వహించేందుకు ఆయా కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.


