భట్టిప్రోలు: భట్టిప్రోలు విఠలేశ్వర్‌నగర నగర్ వీధిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నట్లు పద్మశాలీయ సంఘం నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా నగర్ వీధిలో రామమందిరం వద్ద నిర్మించిన చలువ పందిరిలో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. చిన్నారులతో కోలాటం, శ్రీ లక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రం నాట్య గురువు ఎ.వెంకట లక్ష్మి(తెనాలి) ఆధ్వర్యంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వివరించారు. తితిదే, బాల గోపాల భజన మండలి స్థానిక మాతా కాల్వెంట్ బాలికలతో కోలాట ప్రదర్శన జరుగుతుందని అధ్యక్షులు బూర్లె అరుణకుమారి, కొత్త నాగవెంకట రవితేజ పేర్కొన్నారు.
రేపల్లె: రేపల్లె మున్సిపల్ స్పెషల్ అధికారిగా ఆర్డీవో బూసి శ్రీదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కౌన్సిల్ రద్దు కావడంతో పరిపాలనా బాధ్యతలు నిర్వహించేందుకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్‌ను నియమించింది. దీంతో స్పెషల్ ఆఫీసర్‌గా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు.
వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలి
చెరుకుపల్లి: జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో పోలీస్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రమాదాలను నియంత్రించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పోలీస్, ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. గురువారం మండలలోని కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని ఆయన పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. జాతీయ రహదారిపై వాహనాలు అతి వేగంగా వస్తాయని.. వాటి వేగాన్ని నియంత్రించేందుకు వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానిక ఎస్‌ఐ టి.అనీల్‌కుమార్‌కు సూచించారు.
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలలో పలు ఉద్యోగాలను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలు 85, ఆఫీస్ సబార్డినేట్స్ 26, ల్యాబ్ టెక్నీషియన్స్ 20, ల్యాబ్ అటెండెంట్ 10, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 8, ఇలా 27 రకాల ఉద్యోగాలు జీజీహెచ్, వైద్య కళాశాలలో భర్తీ చేస్తున్నామన్నారు. విద్యార్హతలు, వేతనాలు, వివరాల కోసం http: guntur.ap.gov.in లేదా www. gunturmedicalcollege.edu.in గుంటూరు మెడికల్ కాలేజ్.ఈడీయూ.ఇన్ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.


