అంకితభావంతో పనిచేసినప్పుడే గుర్తింపు
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: అంకితభావంతో పనిచేసినప్పుడే పోలీసులకు సరైన గుర్తింపు వస్తుందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న వార్షిక మొబలైజేషన్ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ముగింపు సందర్భంగా జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో క్యాంప్ ఫైర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ నిత్యం ఉండే పని ఒత్తిడిని పక్కన పెట్టి, సిబ్బంది కొద్దిసేపు ఆహ్లాదకరంగా గడిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేసుకోవడానికి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది ఒక మంచి వేదికన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నిరంతర ప్రక్రియని, ప్రజల విశ్వాసాన్ని పొందడమే పోలీస్ వ్యవస్థకు అసలైన పునాదని పేర్కొన్నారు. జిల్లాలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలీస్ సిబ్బంది ప్రజా సేవకుడిగా పనిచేస్తూ వారి మన్ననలు పొందాలని వివరించారు.
మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమం ముగింపులో భాగంగా ఎస్పీ క్యాంప్ ఫైర్‌ను వెలిగించి వేడుకలను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్, సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ పాల్గొన్నారు.


