ఆర్‌వీఆర్‌జేసీ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ
గుంటూరు రూరల్: కళాశాల విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్ వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్ జాతీయ స్థాయి వైజ్ఞానిక పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించి, సమాజానికి ఉపయోగపడే వినూత్న ఆవిష్కరణలకు ఆర్‌వీఆర్ జేసీ కళాశాల కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుండటం గర్వకారణమని కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జె మురళీమోహన్, డాక్టర్ జగదీష్‌లు పేర్కొన్నారు. శనివారం చౌడవరం గ్రామంలోని కళాశాలలో విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో శారీరక వికలాంగులు, వృద్ధుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్నెట్ సదుపాయం అవసరం లేకుండా కేవలం మనిషి గొంతు ఆదేశాలతో పనిచేసే స్మార్ట్ వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్ (ప్రొటోటైప్) విద్యార్థులు ఆవిష్కరించారని తెలిపారు. ఈ ఆవిష్కరణకు ప్రథమ స్థానం దక్కడంతో పాటు రూ.25,000 నగదు బహుమతి ప్రశంసా పత్రాలు అందుకున్నారన్నారు. సమాజానికి మేలు చేసే సాంకేతిక పరిష్కారాలతో ముందుకు సాగడం గర్వకారణమని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్‌లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎం.భార్గవ్‌నాగతేజ, కె.సాయిచైతన్య, తృతీయ సంవత్సరం చదువుతున్న పి. శేఖర్, ఐ.ఓ.టి విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎన్.అఖిల్‌శివచౌదరి కలసి రూపొందించిన వీల్ చైర్ ఎటువంటి వై–ఫై లేదా మొబైల్ డేటా అవసరం లేకుండా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, డాక్టర్ నాగమల్లేశ్వరరావు, డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ ఏ ముద్దు విద్యార్థులను అభినందించారు.
స్మార్ట్ వాయిస్ కంట్రోల్డ్ వీల్ చైర్‌కు
ప్రథమ బహుమతి


