రైతులే స్వయంగా సాగు వివరాలు నమోదు చేయాలి
వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సుమూన్ పెదకాకాని, వెనిగండ్ల గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు
పెదకాకాని: రైతులు వారి మొబైల్ ఫోన్ ద్వారా సాగు వివరాలు నమోదు చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సుమూన్ అన్నారు. పెదకాకాని మండలం పెదకాకాని, వెనిగండ్ల గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సుమూన్ శనివారం ఆకస్మికంగా పర్యటించారు. ఏపీ ఎయిమ్స్ (ఏపిఎఐఎంఎస్) అనే యాప్‌ని రైతులు వారి మొబైల్ ఫోన్‌లో స్వయంగా రిజిస్ట్రేషన్ చేసి ఆ యాప్ పనిచేసే విధానాన్ని రైతులకు వివరించారు. యాప్‌లో ఇంకా ఏమేమి జోడిస్తే బాగుంటుంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు పండించిన పంటను తనంతట తానే నమోదు చేసుకునే విధానాన్ని బోయపాటి రమేష్ ద్వారా చేయించారు. మొక్కజొన్న పంటను పరిశీలించి కలుపు మందుల పిచికారి గురించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పురుగుమందుల ద్వారా కాకుండా మనుషుల ద్వారా కలుపును తీయిస్తే అయ్యే ఖర్చు, పురుగుమందుల ద్వారా కలుపు నివారణకు అయ్యే ఖర్చు గురించి తెలుసుకున్నారు. సబ్సిడీపై ఆయిల్ ఇంజన్లు, పైపులు ఇప్పించాలని రైతులు కోరారు. అనంతరం వెనిగండ్ల గ్రామాన్ని సందర్శించి జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా మట్టి నమూనాలను సేకరించటం, ఆన్‌లైన్ అప్‌లోడ్ చేసే విధానాన్ని పరిశీలించారు. గ్రామ రైతు పులగం రామిరెడ్డితోపాటు పలువురు రైతులు ఆయిల్ ఇంజిన్లు, పైపులు, నల్ల పట్టాలు, సిర్పాలిన్ పట్టాలు సబ్సిడీపై అందించాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఐ.నాగేశ్వరరావు, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి, జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్ మోహన్‌రావు, ఏఓ కె రమణకుమార్ పాల్గొన్నారు.


