3న సాయిబాబా మందిర వార్షికోత్సవం
మంగళగిరి టౌన్: మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని భగవాన్ శ్రీ సత్య షిర్డీ సాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవ మహోత్సవం ఫిబ్రవరి 3వ తేదీన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం తెలిపారు. ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో శుక్రవారం వార్షికోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 19 సంవత్సరాలుగా ఏటా వేడుకలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలే భావితరాలకు ఇచ్చే వారసత్వ సంపద అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 5.15 గంటలకు బాబాకు కాగడ హారతి, 6కు పాలాభిషేకం, 8కి అన్నాభిషేకం, 9 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా కృపకు పాత్రులు కావాలని కోరారు. మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర పద్మశాలీయ సంఘం అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ అన్నె శేషారావు తదితరులు పాల్గొన్నారు.


