వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు
తాడికొండ: తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడిలో సోమవారం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యే వీవీఐపీలు, వీఐపీలు, ఇతర ప్రముఖులు, ప్రజల వాహనాల రాకపోకల కోసం ఈ క్రింది ట్రాఫిక్ మార్గాలను కేటాయించామని తుళ్లూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
రూట్ 1 :
వీవీఐపీ, ఏఏ, ఏ1, ఏ2 పాస్‌లు మరియు రైతులు లోటస్ – కరకట్ట మీదుగా – ఎమ్మెస్సార్ ఆశ్రమం – సీడ్ యాక్సెస్ రోడ్ – ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎడమవైపు నుంచి వేడుకల మైదానానికి చేరుకోవాలి.
రూట్ నెంబర్ 2:
బీ1, బీ2 పాస్ హోల్డర్స్ మరియు రైతులు ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందుకు వెళ్లి వెస్ట్ బైపాస్ రోడ్డు నుంచి వేడుకల మైదానంలోకి చేరుకోవాలి.
● గుంటూరు నుంచి వచ్చే సాధారణ వాహనాలు మురుగన్ హోటల్ సెంటర్ నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లి ఈ–8 రోడ్డు అండర్ పాస్ – మందడం గ్రామం – వెలగపూడి – మోదుగు లింగాయపాలెం – ఈ–4 – పాతవెలగపూడి రోడ్డు జంక్షన్ నుంచి ఈ–4 రోడ్ పార్కింగ్ ప్రదేశానికి వెళ్లాలి.
● విజయవాడ వైపు నుంచి వచ్చు సాధారణ వాహనాలు విజయవాడ – ప్రకాశం బ్యారేజ్ – ఉండవల్లి – ఉండవల్లి గుహలు – పెనుమాక – కృష్ణాయపాలెం – మందడం – వెలగపూడి – ఈ4 రోడ్డు జంక్షన్ – మోదుగ లింగాయపాలెం – ఈ4 రోడ్ పార్కింగ్‌కు వెళ్లాలి.
● గొల్లపూడి నుంచి వచ్చు సాధారణ వాహనాలు విజయవాడ – వెంకట పాలెం – ఈ–8 అండర్ పాస్ – మందడం – వెలగపూడి – ఈ–4 జంక్షన్ – మోదుగ లింగాయ పాలెం – ఈ–4 రోడ్ పార్కింగ్ ప్రదేశానికి వెళ్లాలి.
● తుళ్లూరు నుంచి వచ్చే సాధారణ వాహనాలు తుళ్లూరు – ఈ–6 వెస్ట్ పార్క్ రోడ్ – హైకోర్టు ఈ–4 జంక్షన్ నుంచి ఈ–4 పార్కింగ్ ప్రదేశానికి వెళ్లాలి.
● హైకోర్టు లాయర్ల వాహనాలు ప్రకాశం బ్యారేజ్ – ఉండవల్లి – ఉండవల్లి కేవ్స్ – పెనుమాక – కృష్ణాయపాలెం – మందడం – వెలగపూడి – ఈ–4 రోడ్డు పా ర్కింగ్ ప్రదేశానికి వెళ్లాలి. సభకు వచ్చేవారు అందరూ పోలీస్ వారి సూచనలు గమనించి సహకరించాలని తుళ్లూరు ట్రాఫిక్ పోలీసులు ప్రకటనలో తెలిపారు.
పొన్నూరు: స్థానిక శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. దివంగతులైన తమ గురువులు, ఇతర సిబ్బందిని, మిత్రులను గుర్తు చేసుకుని ముందుగా శ్రద్ధాంజలి ఘటించారు. కళాశాల స్థాపించిన నాటి నుంచి అక్కడే విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఒకచోట చేరి పలుకరించుకున్నారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. తొలుత శ్రీ సాక్షి భావనారాయణ స్వామి ఆలయంలో స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ రాష్ట్రంలోనే శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలకు విశేష స్థానముందన్నారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ వేదాల వెంకట సీతారామాచార్యులు మాట్లాడుతూ తెలుగు బాషాభివృద్ధికి ఈ కళాశాలలో చదివిన వారు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులుగా విశేషమైన సేవలందించినట్లు అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు రాసిన గ్రంథాలు, పుస్తకాలను ఆవిష్కరించారు. అధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో సూరా రామారావు, నారాయణం మురళీధర, పరాశరం శేషుకుమారి, మన్నవ అనసూయదేవి, మాజేటి జగన్నాథరావు, గోవర్ధనం రామకృష్ణ, పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
యథేచ్ఛగా అక్రమణలకు పాల్పడుతున్న జనసేన నాయకుడు
వేమూరు: జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉసా రాజేష్ చెరువు పోరంబోకులో అక్రమ నిర్మాణాలు నిలిపి వేయాలని తెలుగు దేశం పార్టీ నాయకుడు గోపాలం శ్రీనివాసరావు శనివారం తహసీల్దారు వినతిపత్రం అందజేశారు. ఆదివారం మీడియాకు వివరాలు అందించారు. వేమూరు మండలంలోని చావలి గ్రామానికి చెందిన జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ఉసా రాజేష్ చావలి గ్రామంలోని చెరువు పోరంబోకులు అక్రమించి కొన్ని ఇళ్లు నిర్మాణం చేసినట్లు ఆరోపించారు. అదే చెరువు పోరంబోకులో మరొక నిర్మాణంలో చికెన్ స్టాల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అధికారం అడ్డం పెట్టుకొని ప్రభుత్వం పోరంబోకులు అక్రమణాలు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అర్జీలో కోరినట్లు చెప్పారు.


