ఆన్‌లైన్‌లో పరిచయం.. రూ. 18 లక్షలకు టోకరా
లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు
సత్తెనపల్లి: ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి మాటలు నమ్మి ఓ యువకుడు రూ.18 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వెలుగు చూసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి 20వ వార్డుకు చెందిన తుమ్మల వెంకటేష్‌బాబు సెల్‌ఫోన్‌కు సంబంధించిన విడిభాగాలు విక్రయిస్తుంటారు. వెంకటేష్‌బాబుకు సెప్టెంబర్ నెలలో ఢిల్లీకి చెందిన సీహెచ్ రుచి అనే యువతి ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఇరువురు వాట్సాప్ ద్వారా చాటింగ్, మాట్లాడుకోవటం చేశారు. ఆమె తెలుగులో మాట్లాడటంతో నమ్మాడు. ఢిల్లీలోని వసంత విహార్ ఏరియాలో నివసిస్తున్నానని, ఎలైట్ మాల్ స్టోర్ అండ్ ఈ కామర్స్ ఆన్‌లైన్ వ్యాపారానికి మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు ఆమె చెప్పింది. ఆన్‌లైన్‌లో బంగారం, వెండి, తదితర విలువైన వస్తువులు తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించి లాభాలు గడించవచ్చని నమ్మించింది. ఆమె రిఫరల్ ఐడీ లింకు ద్వారా లాగిన్ అయి మొదట ప్రవేశ రుసుము కింద రూ. 40 వేలు కట్టాడు. వివిధ వస్తువుల కొనుగోలు నిమిత్తం నగదు చెల్లించాడు. కొద్ది రోజులకే ధర పెరిగి లాభాటు వచ్చినట్టు చూపారు. గోల్డ్ రింగులు, చైన్లు, బ్రాస్లెట్స్ వంటివి తక్కువ ధరకు ఉన్నట్లు రుచి చెప్పింది. అత్యాశకు పోయిన వెంకటేష్ బాబు మరికొంత డబ్బును యూపీఐ, బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించి వస్తువులు కొనుగోలు చేశారు. ఆ నగదు వచ్చేలోపు మరో వస్తువు తక్కువ ధరకు చూపిస్తుండడంతో మొత్తం రూ.18 లక్షలు పెట్టి సామగ్రి కొన్నారు. లాభాలు అధికంగా వచ్చాయని నగదు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. శుక్రవారం రాత్రి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు.


