గుంటూరుకు శనిలా పెమ్మసాని
అహంకారంతో గుంటూరు నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు రైల్వే శాఖ అనుమతులు లేకుండా ఓవర్ బ్రిడ్జి ఎలా పడగొట్టారు? వ్యాపారులపై దౌర్జన్యం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజం ఆర్‌యూవీ నిర్మించకుండా ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి ఆగ్రహం
పట్నంబజారు: గుంటూరుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనిలా పట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అధికారం ఉందనే గర్వంతో విర్రవీగుతున్నారని మండి పడ్డారు. ‘అధికారం ఉంటే నువ్వేమైనా రౌడీవా పెమ్మసాని’ అని ప్రశ్నించారు. శనివారం గుంటూరు నగరంలోని శంకర్‌విలాస్ సెంటర్‌లో జరుగుతున్న ఓవర్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. తొలుత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పరిశీలించిన అనంతరం అరండల్‌పేట వైపు వచ్చి పిల్లర్లు, తదితర అంశాలను పరిశీలించారు. స్థానిక వ్యాపారులు తమ గోడును వైఎస్సార్‌సీపీ నేతలకు తెలిపారు. ఫ్లయ్ ఓవర్‌కు అటు, ఇటు 12 అడుగులు వదిలి పెట్టాలని కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్పొరేషన్ అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, షాపుల తాళాలు పగులగొడుతున్నారని తెలిపారు. ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టాలని ఇబ్బంది పెడుతున్నారని, బాండ్లు ఇస్తామని చెబుతున్నారు తప్ప నష్ట పరిహారంపై మాట్లాడటం లేదన్నారు.
డమ్మీలుగా ముగ్గురు ఎమ్మెల్యేలు
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పెమ్మసాని పెత్తనమే కొనసాగుతోందని ఆరోపించారు. నగరంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు డమ్మీలు మాత్రమేనని విమర్శించారు. రూ. 90 కోట్లతో అసలు బ్రిడ్జిని ఏవిధంగా నిర్మిస్తారని ప్రశ్నించారు. తాము బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 2014, 2019 సమయంలో ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు, అప్పటి ఎంపీ గల్లా జయదేవ్, పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డి రూ. 167 కోట్లతో సింగిల్ పిల్లర్ బ్రిడ్జినిర్మాణంతోపాటు, ఆర్‌యూబీ నిర్మించి నగరానికే మణిహారంలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారని తెలిపారు. నగరాన్ని సర్వనాశనం చేసేందుకే పెమ్మసాని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కనీసం అఖిల పక్ష సమావేశం నిర్వహించకుండా పెద్ద ఇంజినీర్లు చెబుతున్నప్పటికీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కేవలం సగం బ్రిడ్జి మాత్రమే పడగొట్టారని, కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా అసలు బ్రిడ్జి ఎలా ప్రారంభిద్దామని అనుకున్నారని ప్రశ్నించారు.
అడ్డగోలుగా పనులు
మాజీ ఎంపీ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లా పార్టీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ శంకర్‌విలాస్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంపై కనీసం అఖిల పక్ష కమిటీతో చర్చలు లేకుండా ఎలా పనులు ప్రారంభించారని ప్రశ్నించారు. బ్రాడీపేటకు సంబంధించి 14 అడ్డరోడ్డు తెరవకపోవడం పాలకులు, అధికారుల బుద్ధి లేని తనానికి నిదర్శనమన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి లేకుండా బ్రిడ్జి పడగొట్టి, ఆర్‌యూబీ కూడా నిర్మాణం చేపట్టని దుస్థితిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులకు వెళ్లే సమయాల్లో పేదలు ఆటోలోనే మృతి చెందుతున్న పరిస్థితులు ఎంతో బాధాకరమన్నారు. వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్, మెట్టు వెంకటప్పారెడ్డి, బైరెడ్డి రవీంద్రారెడ్డి, నందేటి రాజేష్, మామిడి రాము, పఠాన్ అబ్దుల్లా ఖాన్, ఎర్రబాబు, మేడా మురళి, వంగా సీతారామిరెడ్డి, సింగ్ నరసింహారావు, యేటి కోటేశ్వరరావు యాదవ్, బత్తుల దేవానంద్, కార్పొరేటర్లు ఆచారి, అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, కామిరెడ్డి రంగారెడ్డి, అంబేడ్కర్, పూనూరి నాగేశ్వరరావు, పోలవరపు వెంకటేశ్వర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఆలా కిరణ్, పఠాన్ సైదా ఖాన్, కానూరి శశిధర్, బుల్లెట్ సలీం, పిల్లి మేరి, తదితరులు పాల్గొన్నారు.


