దళారుల దందా
అధికారులు విఫలం
ధాన్యం సేకరణలో అక్రమాలు తేమశాతం సాకు చూపి దోపిడీ రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం భయపెట్టి తక్కువ ధరకు ధాన్యం కొంటున్న మిల్లర్లు మిల్లర్లు కొన్న ధాన్యాన్ని ప్రొక్యూర్‌మెంట్‌లో చూపి దోపిడీ తీవ్రంగా నష్టపోతున్న రైతులు
మేము అధికారంలోకి వస్తే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని బాకా ఊదిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. ధాన్యం సేకరణ చేస్తున్నామని చెబుతున్నా ఎక్కడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. తేమ శాతం సాకుగా చూపి కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. అధికారులు దళారులతో కుమ్మక్కై రైతుల కడుపు కొడుతున్నారు. మద్దతు ధర లభించక అన్నదాతలు నష్టపోతున్నారు.
సాక్షి ప్రతినిధి,బాపట్ల: రేపల్లె మండలం పెనుమూడి గ్రామానికి చెందిన కౌలు రైతు నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేసి ఇటీవల కోత కోశాడు. రెండు రోజులు ఆరబెట్టి రైతు సేవా కేంద్రానికి ధాన్యం తీసుకెళితే తేమశాతం 20గా ఉందని, మరో రెండు రోజులు ఆరబెట్టి తీసుకరావాలని చెప్పారు. అక్కడే ఉన్న దళారి ఽఈ క్రాప్, పాస్ పుస్తకం పేపర్లు ఇస్తే ధాన్యం అమ్మిస్తానని నమ్మబలికి రైతును రైస్‌మిల్లుకు తీసుకెళ్లాడు. అక్కడ చూస్తే తేమ శాతం 26గా వుంది. అదనంగా ఉన్న తొమ్మిది పాయింట్లకు 9 కిలోల ధాన్యం కోతకు అంగీకరిస్తే ఓకే అన్నాడు దళారి. ధాన్యాన్ని మరో రెండు రోజులు ఆరబెట్టే వసతి లేకపోవడం, ఈలోపు వర్షం కురిస్తే ధాన్యం అమ్ముకోలేనని భయపడ్డ రైతు మిల్లర్ షరతులకు అంగీకరించి దళారి చెప్పినట్లు ధాన్యాన్ని తెగనమ్ముకున్నాడు. తేమశాతం 17 ఉంటే 75 కిలోల బస్తాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.1792 ఇవ్వాల్సి ఉండగా కిలోకు రూ.23.82 చొప్పున 9 కిలోలకు రూ.215 పోను బస్తా కు కేవలం రూ.1576 ఇచ్చారు. రైతు ఈ క్రాప్, పాస్‌పుస్తకం పేపర్లు తీసుకున్న రైస్ మిల్లర్ పౌరసరఫరాల అధికారితో కలిసి సదరు రైతు పేరు ప్రొక్యూర్‌మెంట్ జాబితాలో చేర్చుకొని మద్దతు ధరను సొంతం చేసుకుంటారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు ఎలా జరిపిస్తారన్న దానికి ఇదో ఉదాహరణ.
ధాన్యాన్ని అమ్మాలంటూ వేమూరు మండలానికి చెందిన రైతును అడిగాడు దళారి. మద్దతు ధరకు అమ్ముకుంటానంటూ రైతు ఽకుదరదన్నాడు. ఆరబెట్టిన ధాన్యాన్ని రెండు రోజుల తరువాత రైతుసేవా కేంద్రానికి తీసుకెళ్లి చూపించాడు రైతు. కొంటామని చెప్పిన సిబ్బంది రెండు రోజుల తర్వాత అదే దళారిని వెంటబెట్టుకొని వచ్చి తేమ శాతం 20కి పైగా ఉందని, మరో రెండు రోజులు ఆరబెట్టాలన్నారు. వెకిలిగా నవ్విన దళారి నాకు తెలియకుండా ఈ ఊర్లో ప్రభుత్వం ధాన్యం కొనదు అన్నాడు. నువ్వు ఓకే అంటే అమ్మిస్తానన్నాడు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం ఎలావుందో ఈ ఘటన ఉదాహరణ.
రంగంలోకి దళారులు
ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల తరపున దళారులు రంగంలోకి దిగారు. ప్రతి రైతు సేవా కేంద్రంలోనూ వారు తిష్టవేశారు. ధాన్యం తీసుకు వచ్చిన రైతులకు తేమశాతం అధికంగా చూపి భయపెడుతున్నారు. ఆ తర్వాత ధాన్యాన్ని మిల్లర్లకు అమ్మిస్తున్నారు. ఈ క్రాప్, పాస్ పుస్తకం పేపర్లు రైతుల నుంచి తీసుకుంటున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే ఆ రైతుల ధాన్యాన్ని మిల్లర్లు కొనడంలేదు. మద్దతు ధరకు ధాన్యం కొనాల్సిన రైతు సేవా కేంద్రాల అధికారులు మిల్లర్లు నియమించుకున్న దళారులు చెప్పిన రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొంటున్నారని కర్లపాలెం మండలానికి చెందిన సర్పంచ్ సాక్షితో వాపోయారు. రైతు సేవాకేంద్రాల్లో ఉన్న తేమ శాతం యంత్రాలకు, రైస్ మిల్లుల్లో ఉన్న యంత్రాలకు పొంతన సరిపోవడంలేదు. రెండు యంత్రాలకు 6 నుంచి 10 శాతం తేడా ఉంటోంది. రైతు సేవా కేంద్రాల్లోని కొన్ని యంత్రాల్లోనూ అధికారులు, మిల్లర్లు కలిసి తేమశాతం అధికంగా ఉండేలా చేసినట్లు ఆరోపణలున్నాయి. తేమశాతం యంత్రాల్లో తేడాలు రాకుండా చూసుకోవాలని, వీలైనంత వరకూ రైతుసేవా కేంద్రాల్లో ఉన్న యంత్రాలు రైస్‌మిల్లుల్లో కూడా ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ పదేపదే చెప్పినా అమలు కావడంలేదు.
దళారులను కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. రైతు సేవా కేంద్రం అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల అధికారులు మిల్లర్లు ప్రతిఏటా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తెరతీయం మామూలైంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలలో సగం కూడా మద్దతు ధరకు కొనడం లేదన్న విమర్శలున్నాయి. మిల్లర్లు తేమశాతం అధికంగా చూపి రైతులను భయపెట్టి తక్కువ ధరకు కొన్న ధాన్యాన్ని ప్రభుత్వం ప్రొక్యూర్‌మెంట్ కింద చూపి పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లు కలిసి రూ.కోట్లలో డబ్బులు కొల్లగొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి ఏటా ఇదే జరుగుతున్నా ఉన్నతాధికారులు అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్నారు.


