వెటరన్.. అదిరెన్
ప్రత్తిపాడు: వెటరన్ క్రీడాకారులు అదరగొట్టారు. వయస్సును లెక్కచేయకుండా మూడు పదుల నుంచి ఏడు పదుల వయసు వరకూ సత్తా చాటారు. ప్రతిభకు ఆసక్తికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. పెదనందిపాడు మండలం పాలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 45వ రాష్ట్ర స్థాయి చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. జాతీయ పతాకంతోపాటు క్రీడా జెండాను ఎగురవేశారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఆయా రాష్ట్రాల క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రెండు రోజుల పాటు జరగనున్న పోటీల్లో భాగంగా తొలిరోజు లాంగ్ జంప్, షాట్ పుట్, 100, 800 మీటర్ల పరుగు పందెం పోటీలను నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి సుమారు నాలుగు వందల మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి 35 ప్లస్, 40 ప్లస్ , 45 ప్లస్ , 50 ప్లస్ , 55 ప్లస్ , 61 ప్లస్ , 65 ప్లస్, 70 ప్లస్.. ఇలా వయస్సుల వారీగా మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు జరిగాయి.
విజేతల వివరాలు ఇవీ..
తొలిరోజు విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఏపీఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ మంగా వరప్రసాద్, వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గణేశుని రాంబాబు, జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి శివనాగేశ్వరరావులు వెల్లడించారు. షాట్‌పుట్ 30 ప్లస్ మహిళల విభాగంలో ప్రథమ స్థానంలో వి. సుదీప్తి (కృష్ణా జిల్లా), ద్వితీయ స్థానం ఎ. సావిత్రి (గుంటూరు), 40 ప్లస్ విభాగంలో డి. స్వర్ణవాహిణి (కృష్ణా) ప్రథమ స్థానం, ఆర్. నిర్మల (విశాఖపట్నం) ద్వితీయ స్థానం, 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ సి. విజయకళ ప్రథమ, కె. పద్మావతి ద్వితీయ స్థానాలు, 65 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన జె. లక్ష్మీ నరసమ్మ ప్రథమ స్థానం సాధించింది. మహిళల 800 మీటర్ల రన్నింగ్ పోటీల్లో 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన పి. కోటేశ్వరమ్మ ప్రథమ స్థానం, పి. రాజేశ్వరమ్మ ద్వితీయ స్థానం, 65 ప్లస్ విభాగంలో నెల్లూరుకు చెందిన జె. లక్ష్మీనరసమ్మ ప్రథమ స్థానం సాధించారు. షాట్‌పుట్ 70 ప్లస్ మహిళల విభాగంలో విశాఖపట్నానికి చెందిన బి. వెంకటలక్ష్మి ప్రథమ స్థానం సాధించింది. 100 మీటర్ల పురుషుల పరుగు పందెం 70 ప్లస్ విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన ధనుంజయ, గుంటూరుకు చెందిన పి. వెంకటప్పయ్య, విశాఖకు చెందిన శంకరరావులు విజయం సాధించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు.
రన్నింగ్ పోటీల్లో క్రీడాకారుడు
లాంగ్ జంప్ పోటీల్లో మహిళ
ఉత్సాహంగా ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ ఆరంభం
వెటరన్.. అదిరెన్
వెటరన్.. అదిరెన్
వెటరన్.. అదిరెన్


