చేనేతకు దక్కని చేయూత
చినుకు పడితే వణుకే..
●మగ్గం గుంతల్లోనే తెల్లారిపోతున్న జీవనం
●చంద్రబాబు సర్కారు హామీలేవీ..?
●వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తంతో ఊరట
చీరాల: వరుస అల్పపీడనాలు, తుఫాన్ల కారణంగా చేనేత మగ్గం మూగబోతోంది. చంద్రబాబు సర్కారు చేనేతలకు తుఫాన్ నష్టపరిహారం ప్రకటించినా అది కూడా కొందరికే అంటూ ప్రకటనలు చేశారు. జిల్లాలో 33,184 వేల మగ్గాల వరకు ఉండగా 24,000 చేనేత కుటుంబాల వారు ఉన్నారు. వీరిలో మొత్తం 50 వేల మంది చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వరుస వర్షాలతో చేనేత కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. మగ్గం గుంతల్లోకి నీరు చేరి ఇబ్బందులు పడినా ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించలేదు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ రూ.5వేల ఆర్థిక సహాయం అందించలేదు. దెబ్బతిన్న పడుగులు, యారన్ తీసుకువస్తే వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందించి పరిహారం అందించేలా చూస్తామనే మెలిక పెట్టారు. చేనేత కాలనీలు నీటమునిగి నేత పనికి అడ్డంకి ఏర్పడితే ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఆ వైపునకు రాలేదని చేనేత కార్మికులు వాపోతున్నారు. చీరాల నియోజకవర్గంలోని మండలాల్లో వర్షం వలన మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్‌బాబు వేటపాలెం మండలంలోని చేనేత మగ్గాలను పరిశీలించి చేనేతలతో మాట్లాడారు. అలానే ప్రభుత్వపరంగా సహాయం అందించాలని కోరుతూ ఆర్డీఓకు వినతిపత్రం అందించారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేనేతను ఆదుకున్నారు. వర్షాల కారణంగా చేనేతలు ఇబ్బందులు పడితే అధికారులతో నివేదిక తెప్పించుకుని వారికి తక్షణ సహాయం అందించారు. అలానే ఇచ్చిన హామీ ప్రకారం నేతన్న నేస్తం పేరుతో ప్రతి చేనేత కార్మికుడికి రూ.24 వేల నేరుగా లబ్ధిదారుని అకౌంట్‌కు జమ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.24 వేలు ఇస్తే అందుకు దీటుగా రూ.25వేలు అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా అది ప్రకటనలకే పరిమితమైంది. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన తర్వాత చేనేతలకు జరిగిన మేలు ఏమీ లేదు. వరుస వర్షాలు, ప్రభుత్వం చేయూత లేక చేనేతలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
చీరాల రూరల్ గ్రామాల్లో ఎక్కువగా చేనేత కుటుంబాలే ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తే వర్షం నీరు కాలనీలను చుట్టుముడుతోంది. వేమూరు నియోజకవర్గంలో నీటి ఊట ఊరడంతో మగ్గం పనులు నిలిచిపోతున్నాయి. కాలనీల చుట్టూ నీరు నిలిచిపోవడంతో మగ్గం గుంతల్లోకి నీరు చేరుతోంది. ఫలితంగా మగ్గం నేయలేని పరిస్థితి నెలకొంది. కొందరు మగ్గం నీటి ఊటను మోటార్లుతో తోడుకుంటున్నారు. నీరు తోడినా మళ్లీ నీరు ఊరడంతో చీరలు నేసేందుకు వీలుండటం లేదు. దోమలు వ్యాప్తి కూడా ఎక్కువగా ఉండటంతో మగ్గం గుంతలోకి వెళ్లే పరిస్థితి లేదు. వర్షం నీరు వెళ్లే వరకు మగ్గం మూగబోవాల్సిందే.
చేనేతకు దక్కని చేయూత


