మహిళను మోసగించి భూమి లాగేసిన ప్రబుద్ధుడు
పర్చూరు(చినగంజాం): తన దగ్గర బంధువే కదా అని భూమిని కౌలుకు ఇచ్చిన మహిళను నమ్మించి మోసగించాడు ఓ ప్రబుద్ధుడు. ఇదేమని అడిగినందుకు మహిళను తన్ని మురుగు కాలువలోకి నెట్టేసిన ఘటన సోమవారం పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు యలగాల నాగేంద్రమ్మ వివరాల మేరకు..
మార్టూరుకు చెందిన యలగాల నాగేంద్రమ్మ అనే మహిళకు పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలో 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నాగేంద్రమ్మ అదే గ్రామానికి చెందిన తన సొంత సోదరి కుమార్తె కోటేశ్వరమ్మను దత్తత తీసుకుంది. గ్రామంలో ఉన్న తన భూమిని తన దత్తత కుమార్తె కోటేశ్వరమ్మ తోబుట్టువు బోయిన శ్రీనివాసరావుకు గత 20 ఏళ్లకు పైగా కౌలుకు ఇచ్చింది. అతడు ఎంత కౌలు ఇస్తే అంత తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో శనగలు రాయితీపై ఇస్తున్నారని తాను తీసుకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఓ కాగితం కావాలని నిరక్షరాస్యులైన నాగేంద్రమ్మను నమ్మించి 2019లో శ్రీనివాసరావు ఆమె నుంచి 1.50 ఎకరాకు తన పేరిట గిఫ్ట్ డీడ్ రాయించుకున్నాడు. అయినప్పటికీ విషయం బయటకు పొక్కకుండా గత ఐదేళ్లుగా నమ్మిస్తూ మొత్తం 9 ఎకరాలకు భూమి కౌలును తన పేరిట రాయించుకున్న 1.50 ఎకరాకు కూడా కలిపి ఆమెకు ఎటువంటి అనుమానం రాకుండా చెల్లిస్తూ వస్తున్నాడు.
రీ సర్వేలో బయటపడిన కుతంత్రం..
ఇదిలా కొనసాగుతుండగా ఇటీవల రీ సర్వేలో తన భూమి తన పేరుకు బదులు శ్రీనివాసరావు పేరుతో ఉన్న విషయం తెలుసుకొని నాగేంద్రమ్మ పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో చెప్పుకుంది. ఇదేమని ప్రశ్నించిన పెద్ద మనుషులను శ్రీనివాసరావు బేఖాతరు చేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళితే తనకు న్యాయం జరుగుతుందని నాగేంద్రమ్మ సోమవారం వారం ఉదయం బాపట్లలోని గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి తనను మోసగించి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తి నుంచి తన భూమిని తిరిగి ఇప్పించవలసిందిగా కోరింది. అనంతరం చెరుకూరు గ్రామంలో ఉన్న తన భూమిని చూసుకునేందుకు వెళ్లింది. ఆమెతో పాటు ఆమె దత్తత కుమార్తె కోటేశ్వరమ్మ, ఆమె కుమార్తె నాగలక్ష్మిలు వెంట వెళ్లారు. తమపై నాగేంద్రమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిందన్న విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు, అతని భార్య రామాంజమ్మ, కుటుంబ సభ్యులు యర్రాకుల గోపి, బోయిన హరిప్రియ, బుర్ల వెంకాయమ్మలు బాధితురాలు నాగేంద్రమ్మ, ఆమె వెంట ఉన్నవారిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. నాగేంద్రమ్మ దత్తత కుమార్తె కోటేశ్వరమ్మను నిందితుడు బోయిన శ్రీనివాసరావు స్వయానా తోడబుట్టిన సోదరి అయినప్పటికీ ఆమెను మురుగు కాలువలో పడవేసి దాడి చేయడం గమనార్హం. గాయాలపాలైన బాధితులు పర్చూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యచికిత్స చేయించుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మహిళను మోసగించి భూమి లాగేసిన ప్రబుద్ధుడు


