
జనార్దనరావు వీడియో వెనుక ప్రభుత్వ పెద్దలు
ఒంగోలు సిటీ: కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారు చేస్తూ, ఆధారాలతో సహా బయటపడినప్పటి నుంచి దాన్ని ఎలాగైనా వైఎస్సార్ సీపీకి అంటించేందుకు టీడీపీ పెద్దలు చేస్తున్న కుట్రలు పరాకాష్టకు చేరాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు ఆరోపించారు. నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌కు ప్రమేయం ఉందంటూ ఆ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. దానిపై ఎల్లో మీడియా రెచ్చిపోతూ, నిన్న సాయంత్రం నుంచే ట్రోల్స్ చేస్తోందన్నారు. కేవలం వైఎస్సార్ సీపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా కక్ష సాధింపులకు పాల్పడడం, కేసు నుంచి బయట పడేందుకు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా సీఎం నారా చంద్రబాబు చేసిన కుట్ర అని దుయ్యబట్టారు. ‘అసలు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న అద్దేపల్లి జనార్దనరావు వీడియో ఎలా రికార్డ్ చేశాడు? పైగా తన ఫోన్ పోయిందని చెప్పినట్లు ఎల్లో మీడియాలోనే వచ్చింది. అలాగే ఏ కేసులో నిందితుడైనా, విచారణ అధికారుల ముందు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నిలబడి, చేతులు కట్టుకుని వినమ్రతతో మాట్లాడతారు. కానీ నిన్న జనార్దనరావు లీక్ చేసిన వీడియోలో ఆయన చక్కగా చైర్‌లో కూర్చుని ఉన్నాడు. పక్క నుంచి ఆఫీసర్ ఎవరో ప్రామ్ట్ చేస్తునట్లుగా ఉంది. పైగా తను ఆఫ్రికా నుంచి వచ్చినప్పటి డ్రెస్‌తోనే ఉన్నాడు. మరి ఆ వీడియో ఎప్పుడు, ఎవరు, ఎవరి ఫోన్‌లో రికార్డు చేశారు? ఇదంతా చూస్తుంటే, ఒక పథకం ప్రకారం చేసిన కుట్ర మాదిరిగా కనిపించడం లేదా’ అని వరికూటి సూటిగా ప్రశ్నించారు. అలాగే ఆ వీడియోను మీడియాకు ఎవరు విడుదల చేశారు? అన్నది తేలాలన్నారు. ఈ కేసులో వాస్తవాలను కప్పిపుచ్చుతూ కొత్త కట్టుకథ వినిపించేందుకే ఆ వీడియో విడుదల చేశారన్నది స్పష్టమవుతోందని పేర్కొన్నారు. పోలీసుల అదుపులో, జైలు అధికారుల రిమాండ్‌లో ఉన్న వ్యక్తి వీడియో లీకు కావడానికి బాధ్యత ఎవరిదని నిలదీశారు. జనార్దనరావు గత వారం ఆఫ్రికా నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడని, నకిలీ మద్యం తయారీలో పార్టీ, ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేదని, తాము మాత్రమే ఆ పని చేశామని చెప్పుకొచ్చాయడన్నారు. ఆ రోజే మరి నిజంగా జోగి రమేష్ పేరు ఎందుకు ప్రస్తావించలేదని, రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం తయారుచేసిన విషయాన్ని ఆ వీడియోలోనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
చంద్రబాబుకు సన్నిహితుడే..
కేసులో ఏ–1 నిందితుడైన జనార్దనరావు చంద్రబాబుకు సన్నిహితుడేనని, 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్దనరావు అక్కడే ఉన్నాడన్నారు. బీఫాం ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి జనార్ధనరావు ఆ సమయంలో చంద్రబాబు, జయచంద్రారెడ్డిలతో ఉండటం దేనికి సంకేతమన్నారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా జనార్దనరావుకు జోగి రమేష్ సన్నిహితుడన్న ప్రభుత్వ వాదన పూర్తిగా కట్టు కథగా చెప్పారు. ఇప్పుడు జనార్దనరావు తన వీడియోలో గత ప్రభుత్వ హయాం నుంచి జోగి రమేష్ చెప్పడం వలనే నకిలీ మద్యం తయారు చేశానని చెబుతున్నారని, దానికి, దీనికి లింక్ కుదరడం లేదని పేర్కొన్నారు.
బాబు మాటలే జనార్దనరావు వీడియో..
జనార్దనరావు వీడియో సోమవారం సాయంత్రం విడుదల కాగా, అందులోని విషయాలపై ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు సూచన ప్రాయంగా వివరాలు ఎలా వెల్లడించారు! అంటే సమాచారం ఒక రోజు ముందుగానే ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే.. ఇదంతా ఒక పక్కా వ్యూహం ప్రకారం విపక్ష వైఎస్సార్ సీపీపై బురద చల్లుతూ, తాము ఈ కేసు నుంచి బయట పడేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్రన్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. పెదబాబు, చినబాబు చేసిన కుట్ర, కుతంత్రం ఇదంతా? అది నిజం కాదని చెప్పే ధైర్యం ఆ ఇద్దరికీ ఉందా? అని ప్రశ్నించారు.
ములకలచెరువు నకిలీ మద్యం మాఫియాలో కీలక పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డిని విదేశాల నుంచి రప్పించేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించడం లేదు? ఆయనపై ఎందుకు ఇంకా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం లేదని వరికూటి ప్రశ్నించారు. ఆయన రాష్ట్రానికి వస్తే తమ దందా బయటపడుతుందని ప్రభుత్వ పెద్దలు భయపడుతున్నారని నిలదీశారు. నకిలీ మద్యం బయటపడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారన్నారు. అసలు ఆ నకిలీ అన్నది ఒక ప్రాంతానికే పరిమితం అన్నట్టు నమ్మించేందుకు యత్నించారన్నారు. మరి ఇప్పుడు ఎందుకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం నాణ్యత తనిఖీకి ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు? అంటే నకిలీ మద్యం రాష్ట్రమంతా విస్తరించిందని ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నించారు. నిజంగా జోగి రమేష్ చెబితేనే జనార్దనరావు నకిలీ మద్యం తయారు చేస్తే.. తాను జయచంద్రారెడ్డికి చెందిన వాహనంలోనే ఆ మద్యాన్ని రవాణా చేశానని జయచంద్రారెడ్డి డ్రైవర్ చెప్పారు. మరి అక్కడ కూడా జోగి రమేష్ చెబితేనే ఆ రవాణా జరిగిందా? అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తున్నట్లు నకిలీ మద్యం కేసుపై సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని వైన్‌షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బార్లు, బెల్టు షాప్‌ల్లో తనిఖీలు ఎందుకు చేయడం లేదు? ఏది అసలు మద్యం? ఏది నకిలీ అనేది గుర్తించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని నిలదీశారు.