
రైళ్లపై రాళ్లు విసిరిన అల్లరిమూకలు అరెస్టు
చీరాల: వేగంగా వెళ్తున్న రైళ్లపై గులకరాళ్ల విసిరిన అల్లరి మూకలను మంగళవారం ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు. ఈనెల 12వ తేదీన చీరాల ఆర్వోబీ సమీపంలో గూడ్స్ రైలు, విక్రమ్ సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుపై అల్లరిమూకలు రాళ్లు విసిరినట్లు చెప్పారు. రైలుపై రాళ్లు విసరడంతో కోచ్ అద్దాలు పగిలిపోయి ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పిందన్నారు. అయితే రైళ్లపై రాళ్లు విసిరే ముఠా కోసం ఆర్పీఎఫ్ ఏఎస్‌ఐ రమేష్‌బాబు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు బృందంగా ఏర్పడి గాలింపు చేపట్టారన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆర్వోబీ వద్ద రావూరి మణికంఠ, జగతా సాయి వంశీ, మానుపాటి శ్రీనుని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారన్నారు. ముగ్గురు నిందితులపై రైల్వే యాక్ట్ సెక్షన్ 153 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా ఆకతాయిలు గానీ, చదువుకునే విద్యార్థులు గానీ ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై రైల్వే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో జీఆర్పీ ఎస్‌ఐ కొండయ్య, ఆర్పీఎఫ్ ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.