
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయండి !
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన భూ సేకరణ వేగంగా చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భూ సేకరణ పూర్తయితేనే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని తెలిపారు. ఎన్‌హెచ్ –544 జీ నిర్మాణం కోసం జిల్లాలో సేకరించిన 19.8 హెక్టార్లకు గానూ మరో 4.5 హెక్టార్లలో భూమి సేకరించాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు సేకరించిన భూమికి నష్ట పరిహారాన్ని సదరు వ్యక్తులకు అందించాలని తెలిపారు. జాతీయ రహదారి–167 ఏ నిర్మాణానికి 88.38 హెక్టార్లలో భూమి సేకరించారని, మిగిలిన రెండు హెక్టార్లను కూడా త్వరగా సేకరించాలని ఆదేశించారు. భూమి సేకరించినప్పటికీ 158 మందికి నగదు చెల్లించకపోవడంపై ఆరా తీశారు. వినుకొండ నుంచి గుంటూరు రహదారి విస్తరణ పనులకు భూ సేకరణ ప్రక్రియ నవంబర్‌లోగా పూర్తి చేయాలని తెలిపారు. రొంపేరు కాలువ నిర్మాణానికి 117.45 ఎకరాల భూమి సేకరించగా, ఇందులో కొందరికి నేటికీ నగదు చెల్లించక పోవడంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సోలార్ ప్రాజెక్ట్‌కు తక్షణమే భూమి సేకరించాలి
సోలార్ ప్రాజెక్ట్ నిర్మాణానికి తక్షణమే భూమి సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీని కోసం సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో 203.48 ఎకరాల ప్రభుత్వ భూమి, 1,591.17ఎకరాల పట్టా భూమిని సేకరించాల్సి ఉందన్నారు. మంచినీటి ట్యాంకుల శుభ్రపరిచే యూనిట్ ఏర్పాటు కోసం బాపట్ల మూలపాలెంలో రెండు ఎకరాలు, చీరాల దేవాంగపురి పంచాయతీలో 1.47 ఎకరాలు, ఇసుకపల్లిలో 3.5 4 ఎకరాలు, రేపల్లె బేతపూడిలో 1.35 ఎకరాల సేకరణలో సాంకేతిక సమస్య రావడంతో ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉందని తెలిపారు. నల్లమడ కాల్వ ఆధునికీకరణ పనుల సర్వే రెండు వారాలలో పూర్తి చేయాలని ఆదేశించారు. గుంటూరు చానల్ విస్తరణకు 51.34 ఎకరాలను పర్చూరు మండలంలో భూసేకరణ చేయాలని చెప్పారు. బాపట్లలో ఎస్టీ, బీసీ సామాజిక భవనాల నిర్మాణానికి భూమి సేకరించాలని, స్టేడియం నిర్మాణానికి 7.5 ఎకరాలు, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు ఐదు ఎకరాలు, మార్టూరులో మినీ స్టేడియం ఏర్పాటుకు భూమి సేకరించాలని అధికారులకు సూచించారు.సమావేశంలో డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.