
జీజీహెచ్‌లో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో సోమవారం ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించింది. అత్యవసర సేవల విభాగం, ఎన్‌ఐసీయూ, పీఐసీయూ తదితర వైద్య విభాగాలను పరిశీలించింది. క్వాలిటీ ఎస్యూరెన్స్ నేషనల్ హెల్త్ మిషన్ తరఫున అత్యవసర విభాగం పనితీరు, అత్యధికంగా వస్తున్న రోగులకు మౌలిక వసతుల కల్పనపై అధ్యయనం చేసేందుకు క్యాజువాల్టీలో బృంద సభ్యులు పరిశీలించారు. అందులో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యవసర చికిత్స కోసం ప్రతిరోజూ వచ్చే రోగులు, రోడ్డు ప్రమాద బాధితులకు అందించే చికిత్సలు, అత్యవసర వైద్య సేవలు అందించేందుకు క్యాజువాల్టీలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర విభాగం పనితీరు గురించి, క్యాజువాల్టీలో రోగుల రద్దీని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యల గురించి బృందానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, వివరించారు. అనంతరం అప్పుడే పుట్టిన పసికందులకు చికిత్స అందించే ఎన్‌ఐసీయూ విభాగాన్ని బృంద సభ్యులు పరిశీలించారు. నవజాత శిశువుల మరణాల రేటు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్‌లో రోగులకు ఇన్‌ఫెక్షన్ సోకకుండా కంట్రోల్ కోసం తీసుకుంటున్న చర్యలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, ఇతర వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని పరిశీలించిన వారిలో ప్రపంచ బ్యాంకు బృంద సభ్యులు డాక్టర్ మొహిర్ జోన్, డాక్టర్ ఎడ్వర్డ్, డాక్టర్ గణేష్ మణి, వాసు బాబు తదితరులు ఉన్నారు.