
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీ నష్టం
ఇరవైకి పైగా ఇళ్లలో కాలిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు
చినగంజాం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మండలంలోని మున్నంవారిపాలెం పంచాయతీ బేతాళవారిపాలెంలో సోమవారం పలు ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు భారీగా కాలిపోయాయి. రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. గ్రామంలోని సచివాలయం రోడ్డులో తీగ తెగడంతో అత్యధిక విద్యుత్ గృహ సర్వీసుల్లోకి రావడంతో భారీగా ఉపకరణాలు దెబ్బతిన్నాయి. గ్రామంలో 20 పైగా ఇళ్లలో 10కి పైగా టీవీలు, బల్బులు, 30కి పైగా ఫ్యాన్లు, వాషింగ్ మెషిన్లు, ఇన్వర్టర్లు, స్విచ్ బోర్డులు తగులబడ్డాయి. భారీ శబ్దాలతో విద్యుత్ ఉపకరణాలు తగులబడి పొగలు రావడంతో నివాసితులు భయపడిపోయారు.
భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక చర్చిలోని ఫ్యాన్లు, లైట్లు, ఇన్వర్టర్ సైతంపొగలు వచ్చి కాలిపోయాయి.
పాడై పోయిన వైర్లు
ఇటీవల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. విద్యుత్ వైర్లు పూర్తిగా పాడైపోయాయని, వాటిని తొలగించి మార్చాలని గ్రామస్తులు పలుమార్లు చెప్పినా ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే ప్రాణాలు సైతం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని వాపోయారు. సమస్యపై సాక్షి విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించింది. ప్రస్తుతం గ్రామంలో తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించామని, రెండు రోజుల్లో పరిశీలించి, సమస్య నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో భారీ నష్టం