ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
గుంటూరు వెస్ట్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయిపై సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాది చేసిన దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. సోమవారం స్థానిక డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. కృష్ణమాదిగ విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి దళితుడు కావడం వల్లే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక అభిప్రాయాలుంటాయన్నారు. దానికి ఇలా దాడులు చేయడం అత్యంత హేయమన్నారు. దళితులు దేశంలో ఎన్నో వివక్షలకు గురవుతూ ఎదుగుతుంటే, కొంత మంది ఓర్వలేక అక్కసుతోనే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారన్నారు. దళితులు మరింత పట్టుదలతో ఉన్నత స్థానాలను పొందాలని కోరారు.
గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి తెలిపారు. సోమ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీని డీఆర్వో జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తగ్గిన పన్నుల శాతంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గత నెల 22 నుంచి ఈ నెల 19వ తేదీ వరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ బైక్ ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆశారాణి తదితరులు ప్రసంగించారు. బైక్ ర్యాలీ కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల సెంటర్, జిన్నా టవర్, బస్టాండ్, మంగళగిరి రోడ్డు మీదుగా ఆటోనగర్ వరకు కొనసాగింది.
రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): రాష్ట్ర స్థాయి పిట్టు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఈ నెల 11, 12వ తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ చాంపియన్ షిప్ పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. బాలుర జట్టు ప్రథమ స్థానం, బాలికల జట్టు తృతీయ స్థానం దక్కించుకున్నాయని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దావులూరు సుబ్బారావు, పాపబత్తిని శ్రావ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలను చైర్మన్ రంభ ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు పి.సురేష్, రాష్ట్ర కార్యదర్శి కె.జె జోసఫ్ అభినందించారని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పెదకాకాని: వాకింగ్ చేస్తున మహిళల్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన రమావత్ లక్ష్మి, కొమ్మూరి అరుణ, శ్రీదేవిలు ఇరుగుపొరుగువారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వీసు రోడ్డుకు రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లారు. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొని వెళ్లిపోయింది. రమావత్ లక్ష్మి(43) సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. గాయాలపాలైన కొమ్మూరి అరుణ, శ్రీదేవిలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లక్ష్మి భర్త రామునాయక్ ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి అనాగరిక చర్య
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి అనాగరిక చర్య