
అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు
బాపట్ల టౌన్: పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 66 మంది బాధితులు వచ్చారు. తమ సమస్యలను నేరుగా ఎస్పీకి వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న అనంతరం ఆయన జిల్లాలోని పోలీస్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌స్టేషన్లకు వచ్చే బాధితులతో మర్యాదగా మెలగాలని, వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని చెప్పారు. బాధితులకు భరోసా కల్పించినప్పుడే పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ప్రధానంగా ఫిర్యాదులు కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలపై వస్తున్నాయన్నారు. వాటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ సీఐ ఎం. శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.