
చీఫ్ జస్టీస్ గవాయిపై దాడి హేయం
బాపట్ల టౌన్: చీఫ్ జస్టీస్ బి.ఆర్. గవాయిపై జరిగిన దాడిని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించి దోషిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి మంద పెంచలయ్య డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సోమవారం జిల్లాలోని ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని గడియార స్తంభం నుంచి పాత బస్టాండ్, చీలు రోడ్డు సెంటర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మంద పెంచలయ్య మాట్లాడుతూ గవాయిపై అనాగరిక దాడి వెనుక ఉన్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. విచారణ కమిటీను నియమించి, దాడి వెనుక ఉన్న కుట్రలను త్వరితగతిన తేల్చాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎంఎస్‌పీ అధ్యక్షుడు బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ జస్టీస్ గవాయి ఒంటరివాడు కాదని, ఆయనకు అండగా దళిత సంఘాలు మొత్తం అండగా ఉన్నాయని తెలిపారు. కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈనెల 17న జిల్లాస్థాయిలో, 23న రాష్ట్రస్థాయిలో అమరావతిలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు దుడ్డు వందనం, నాయకులు పాల్గొన్నారు.