
వల విసరక.. బతుకు సాగక..
దయనీయంగా మత్స్యకారుల జీవితాలు
మూడు నెలలుగా కృష్ణానదికి తరచూ వరదలు
చేపల వేటకు వెళ్లలేని పరిస్థితిలో ఆర్థిక కష్టాలు
ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని వేడుకోలు
తాడేపల్లి రూరల్ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో చేపలు వేటాడే మత్స్యకారుల బతుకు దయనీయంగా ఉంది. గత రెండు నెలల నుంచి కృష్ణానదికి తరచూ వరద రావడంతో వల విసరలేని పరిస్థితి నెలకొంది. పొట్ట నింపుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యారేజ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో సుమారు 450 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరే కాకుండా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి వలస వచ్చిన మరో 50 కుటుంబాలు కృష్ణానదిని నమ్ముకునే ఇలా బతుకుతున్నాయి. నదికి కొన్ని నెలలుగా వరద పోటెత్తుతూ ఇప్పుడు 6 లక్షల క్యూసెక్కుల వరకు చేరింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లాలంటే కృష్ణానది గేట్లు తప్పని సరిగా మూసి ఉండాలి. లేని పక్షంలో పడవ నిలిచి వల వేడయానికి కుదరదు. నాలుగైదు నావల వారు కలిసి రాత్రి సమయంలో కృష్ణానదిలో అక్కడక్కడ రంగ వలలతో బుట్టలను ఏర్పాటు చేస్తారు. వరద రావడంతో అవి కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గత మూడు నెలలుగా అందిన చోట అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద సొసైటీలు ఉన్నాయని, వాటి ద్వారా మత్స్యశాఖ అధికారులు ఆర్థిక సహాయాన్ని అందించాలని విన్నవించారు. రేషన్ సరకులు అందజేస్తే కడుపు నింపుకొంటామన్నారు. ప్రస్తుతం తమ కుటుంబాలు అర్ధాకలితో జీవించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.
దోచుకుంటున్న వ్యాపారులు....
కృష్ణానదిలో చేపల వేట లేకపోవడంతో ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని సీతానగరానికి వెళ్లే మార్గంలో చేపల వ్యాపారుల తమకు ఇష్టం వచ్చిన ధరలతో విక్రయిస్తున్నారు. కేజీ చెరువు చేపలను రూ.300 – రూ.500 వరకు అమ్ముతున్నారు. అవి కూడా కృష్ణానది చేపలు అంటూ అంటగడుతున్నారు. దిగువ ప్రాంతంలో చేపల వ్యాపారులు ఏర్పాటు చేసిన కాటాల్లో సైతం భారీ వ్యత్యాసం కనబడుతోంది. కేజీ చేప తీసుకుంటే 750 గ్రాములే ఉంటోందని పలువురు వాపోతున్నారు. తూనికలు, కొలతల అధికారులకు ఫిర్యాదు అందడంతో తనిఖీ చేయగా మోసం వెలుగుచూసింది. 15 కాటాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. అయినా వ్యాపారులు తమ తీరు మార్చుకోవడం లేదని పలువురు కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వల విసరక.. బతుకు సాగక..