
లోతట్టు ప్రాంతాల ప్రజలు అధైర్య పడొద్దు
జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది ట్రాక్టర్లు, బోట్లు అందుబాటులో ఉండాలి పునరావాస కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: ‘‘అధైర్య పడవద్దు.. జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని’’ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా ఇచ్చారు. రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్డీఓ, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు హెబిటేషన్, పునరావాస కేంద్రాల ఇన్‌చార్జిలతో వరద ప్రవాహ పరిస్థితిపై మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాక్టర్లు, బోట్లు సిద్ధంగా పెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులకు అన్ని సౌకర్యాలు ఉండేలా ఇన్‌చార్జి చూసుకోవాలన్నారు. వరద ఉధృతి పెరిగినా ఎదుర్కొనడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు కేటాయించిన అధికారులు, సిబ్బంది రాత్రీపగలు అక్కడే ఉండాలన్నారు. నదిలో నీటి ప్రవాహం తగ్గే వరకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.