
రసవత్తరంగా జాతీయ చెస్ చాంపియన్ షిప్
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్‌షిప్ బుధవారం నాలుగోరౌండ్ ముగిసే సరికి ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు, నలుగురు ఇంటర్నేషనల్ మాస్టర్లు చెరో నాలుగు పాయింట్లతో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. టాప్ బోర్డులపై జీఎంలు, ఐఎంల మధ్య ఉత్కంఠభరితంగా పోటీలు జరిగాయి. మాజీ ఆసియా చాంపియన్, రెండో సీడ్ జీఎం సూర్యశేఖర్ గంగూలీ అలాగే భారత 2700 రేటింగ్ దాటిన రెండో ఆటగాడు జీఎం కృష్ణన్ శశికిరణ్‌లు ప్రతిభ చూపించారు. తమిళనాడు ఆటగాడు ఐఎం మనీష్ ఆంటో క్రిస్టియానోపై పీఎస్‌పీబీ ఆటగాడు గంగూలీ ఎక్సేంజ్ సాక్రిఫైస్ తర్వాత రూక్ త్యాగంతో ఆధిపత్యం సాధించాడు. ఆంధ్ర ఆటగాడు జీఎం ఎం.ఆర్. లలిత్ బాబు ఫ్రెంచ్ డిఫెన్స్‌లో స్థిరమైన ఆట ఆడి, అలేఖ్య ముఖర్జీపై విజయం సాధించాడు. మూడో సీడ్ జీఎం ఎస్.పి.సేతురామన్, హరియాణా ఆటగాడు ఐఎం ఆదిత్య దింగ్రా తప్పిదం వల్ల ఓటమి నుంచి తప్పించుకున్నాడు. గేమ్ డ్రాగా ముగిసింది. కేరళ ఐఎం హెచ్.గౌతమ్ కృష్ణ, గుజరాత్ ఆటగాడు ఘాదవి వీరభద్రసింగ్‌పై అద్భుతంగా ఆడాడు. రూక్ త్యాగం చేసి బ్యాక్ ర్యాంక్ చెక్‌మేట్‌తో విజయం సాధించాడు. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో పొడవైన గేమ్ ఆంధ్ర ఆటగాడు ఐఎం ఎస్. రవితేజ (రైల్వేలు), గుజరాత్ ఆటగాడు జిహాన్ తేజస్ షా మధ్య సాగింది. రవితేజ 140 మూవ్‌ల తర్వాత బిషప్, నైట్ కాంబినేషన్‌తో చెక్‌మేట్ చేశాడు.