
సాంకేతికత జోడింపుతో ఉత్తమ ఫలితాలు
పెదకాకాని(ఏఎన్‌యు): రాష్ట్రంలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో 36వ దక్షిణ మండల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు, ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడల విధానంలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఆధునిక సాంకేతికతను క్రీడల రంగానికి జోడించడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా పలు అథ్లెటిక్ అసోసియేషన్లు, మల్టీ నేషనల్ కంపెనీలు క్రీడలను ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. తొలుత అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పతాకాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ పతాకాన్ని శాప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.