
వైద్యుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టరు ఎం.గోపీనాథ్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టరు వి.వినోధ్‌కుమార్‌ను, జిల్లా వైద్యాధికారిణి డాక్టరు విజయమ్మను మంగళవారం కలిసి సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాలల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్–సర్వీస్ కోటాను పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలని, గిరిజన ప్రాంతాల్లో పని చేసే వారికి అలవెన్సు మంజూరు చేయాలని, నోషనల్ ఇన్‌క్రిమెంట్స్ మంజూరు చేయాలని కోరారు. చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రాం కింద వైద్యులకు రూ.5 వేలు ఇవ్వాలన్నారు. వైద్యులకు కచ్చితమైన పనిగంటలు, స్థిరమైన వారాంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో డాక్టరు పవన్‌చైతన్య తదితరులు ఉన్నారు.