
న్యాయం చేస్తారా... నిందితుడిని అప్పగిస్తారా?
ఎంఈవో, హెచ్‌ఎం, ఉపాధ్యాయులపైనా కేసు నమోదు చేయాలి ప్రత్తిపాడు పోలీస్ స్టేషను ఎదుట రావిపాటివారిపాలెం వాసుల ఆందోళన
ప్రత్తిపాడు: పసి పిల్లలపై నీచంగా, అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడిని కఠినంగా శిక్షించి ‘మాకు న్యాయం చేస్తారా.. లేదా నిందితుడిని అప్పగిస్తారా ?’ అంటూ మహిళలు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రత్తిపాడు మండలం రావిపాటివారిపాలెం ప్రాథమిక పాఠశాలలో స్కావెంజర్ భర్త 72 ఏళ్ల వృద్ధుడు సామియేలు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అతడి అరెస్టు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ఆదివారం రాత్రి రావిపాటివారిపాలెం గ్రామస్తులు పెద్ద ఎత్తున స్థానిక పోలీస్ స్టేషను వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. పాఠశాలకు సంబంధం లేని వ్యక్తిని నెలల తరబడి పాఠశాలలోనికి హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఎలా అనుమతిస్తున్నారని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, తప్పు చేసిన వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎంఈవోతోపాటు హెచ్‌ఎం, ఉపాధ్యాయులపైనా వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్‌ఐ నరహరి మాట్లాడుతూ నిందితుడిని ఆదివారం అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశామని, చట్టప్రకారం అతడిని కోర్టుకు హాజరు పరచనున్నట్లు చెప్పారు. మరలా రెండు నెలల్లో బయటకు వచ్చి తిరుగుతాడని, ఒక్కసారి మాకు అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో ఎస్‌ఐ చట్టాన్ని చేతుల్లోనికి తీసుకోవడం సరికాదని తెలిపారు. బాధిత పిల్లల తల్లిదండ్రులు స్టేషనుకు వచ్చిన వెంటనే కేసు నమోదు చేశామని, ఎలాంటి తాత్సారం చేయలేదని ఎస్‌ఐ స్పష్టం చేశారు.
చట్ట ప్రకారం చర్యలు
గుంటూరు ఎడ్యుకేషన్: నాగమ్మ భర్త విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.