
ఇసుక అక్రమ తరలింపుపై నిలదీసినందుకు దాడి
కొల్లూరు: పట్టపగలు యథేచ్ఛగా వందల ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేపట్టడాన్ని ప్రశ్నించిన వ్యక్తిపై శుక్రవారం మండలంలోని చింతర్లంకలో అక్రమార్కులు దాడికి తెగబడ్డారు. గ్రామంలోని సీసీ రోడ్ల వెంబడి ఉన్న నీటి పైపులు, పశువులు, జీవాల కోసం ఉంచిన గ్రాసాలను తొక్కించుకుంటూ వెళ్లడం, ప్రజలకు హానికరంగా ట్రాక్టర్లు ప్రయాణించడంపై చింతర్లంకకు చెందిన ప్రజా సంఘాల నాయకుడు తోడేటి సురేష్ ప్రశ్నించారు. భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉండటంతోపాటు నదీ తీరం వెంబడి కోతలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు చేపట్టవద్దని పట్టుపట్టడంతో వివాదం చోటుచేసుకుంది. సురేష్‌పై ఇసుక తవ్వకాలకు ప్రోత్సహిస్తున్న వ్యక్తులు తిరగబడటంతో తోపులాట చోటుచేసుకొంది. బాధితుడు ఓ ట్రాక్టర్‌పై పడటంతో గాయపడ్డారు. బంధువులు ఆయన్ను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొల్లూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ. 100 – రూ. 200 వరకు వసూలు చేపట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సంఘాల నాయకుడిపై దాడి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నదిలో ఉన్న ట్రాక్టర్లను అడ్డగించకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు నది వద్దకు వెళ్లే సమయానికి 50కి పైగా ట్రాక్టర్లు ఇసుక నింపుకొని సిద్ధంగా ఉన్నా వాటిని నిలువరించకుండా వెనుతిరగడంపై పోలీసుల తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. దీనిపై కొల్లూరు తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పెసర్లంక అరవిందవారధి, చింతర్లంక గ్రామాలలో పోలీసు, రెవెన్యూ సిబ్బందితో 24 గంటల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తన దృష్టికి సిబ్బంది తీసుకొచ్చారని పేర్కొన్నారు.

ఇసుక అక్రమ తరలింపుపై నిలదీసినందుకు దాడి