
లబ్ధిదారులకు దీపం నగదు బదిలీ చేయాలి
గుంటూరు వెస్ట్: దీపం పథకం – 2 ద్వారా జిల్లాలో 1,257 మందికి సబ్సిడీ నగదు ఖాతాల్లో నమోదు కావడం లేదని వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్సీ హాలులో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, తెనాలి, మేడికొండూరు మండలాల్లో ఎక్కువగా నగదు జమ కాలేదని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 1257 మంది జాబితాను గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లకు పంపాలని జిల్లా సప్లయ్ అధికారికి సూచించారు. వినియోగదారులకు ఫోన్ చేసి ఎందుకు సబ్సిడీ నగదు పడలేదో వివరించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను వచ్చే బుధవారం నాటికి పూర్తి చేయాలని చెప్పారు. ఎల్‌డీఏం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులు లేటెస్ట్ ఆధార్ కార్డు , పాసు పుస్తకం బ్యాంక్‌కు తీసుకువెళ్లి అక్కౌంట్ డీ లింక్ చేయించుకుని, మళ్లీ లింక్ చేయించాలని సూచించారు. కొంత మందికి ఆధార్ ఇన్ ఆక్టివ్ అని వస్తున్నదని, వారికి పొరపాటున రెండు ఆధార్‌లు ఉంటే ఒక కార్డును ఇవ్వాలని తెలిపారు. కొందరికి ఆధార్ బ్యాంక్ ఖాతాకు లింక్ కానందున, ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్ల సబ్సిడీ జమ కావడం లేదని వివరించారు. ఆధార్ అప్ డేట్ వివరాలు లేనివారు 1,031 మంది ఉన్నారని , వారు వివరాలు అందజేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్‌ఓ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ