
పులిచింతలకు 3,02,629 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 15 క్రస్ట్ గేట్లు ద్వారా 3,02,629 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 14 క్రస్ట్ గేట్లు నాలుగు మీటర్లు, ఒక క్రస్ట్‌గేటు 2.5 మీటర్లు ఎత్తు ఎత్తి 3,02,629 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 74.58 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి సామర్థ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.462 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. టీఆర్‌సీ లెవల్ 61.83 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామన్నారు.